25-03-2025 12:28:38 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24 (విజయక్రాంతి): తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి ఆశ కార్యకర్తలు యత్నిస్తూ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు.
కొంతమంది ఉమెన్స్ కళాశాల చౌరస్తాలో బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌జాం అయింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి, కాచిగూడ, ఓయూ, నారాయణగూడ, సుల్తాన్ బజార్ సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్షులు పి.జయలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ..
ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లు, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. గతంలో చేపట్టిన నిరవధిక సమ్మెకు స్పందించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారని గుర్తు చేశారు. డైరెక్టర్ హామీతో సమ్మెను విరమించామన్నారు.
కాంగ్రెస్ కూడా తమకు ఇచ్చిన హామీని విస్మరించిందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ హైదరాబాద్ సౌత్ అధ్యక్షురాలు మీనా, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, హేమలత, గంగామణి, సావిత్రి, మేడ్చల్ జిల్లా రుక్మిన్ పాల్గొన్నారు.