- ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలతో ఫలించిన చర్చలు
- పేదలకు మెరుగైన వైద్యం: మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): పేదలకు విద్య, వైద్యం అందిం చడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా విద్య, వైద్యానికి నిధులు విడుదల చేస్తున్నామన్నారు.
దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల పలు హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ సేవలను (నాన్ ఎమర్జెన్సీ) నిలిపివేయగా.. హాస్పిటల్ యాజమాన్యాలతో సోమవారం మంత్రి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో సమావేశమయ్యారు. ఈ చర్చలు సఫలీకృతం కావడంతో వెంటనే ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతినిధులు అంగీకరించినట్లు మంత్రి ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీకి గతంలో ఏడాదికి సగటున రూ. 500 కోట్లు చెల్లిస్తే, తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రూ.1,137 కోట్లు చెల్లించామన్నారు. గతంలో ఉన్న బకాయిలను కూడా చెల్లించినట్టు చెప్పారు. హాస్పిటళ్లను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం తమకు లేదని, అదే సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగొద్దన్నారు.
యాజమాన్యాలు లేవనె త్తిన ఇతర సమస్యలను కూడా పరిష్కరించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. ప్యాకేజీ రేట్ల రివిజన్‌కు సంబంధించి హాస్పిటళ్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేసి, సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇతర సమస్యలపై చర్చించేందుకు హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ సీఈవోతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ సేవలు యథావిధిగా కొనసా గిస్తామన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ కింద నెలకు సగటున రూ.50 కోట్ల వరకు రిలీజ్ చేయగా, ప్రస్తుతం నెలకు రూ.100 కోట్ల వరకూ రిలీజ్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.