calender_icon.png 27 December, 2024 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం

27-12-2024 02:14:09 AM

  • కేజ్రీవాల్‌ను జాతి వ్యతిరేకి అన్న కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్
  • తీవ్రంగా ఖండించిన ఆప్
  • మాకెన్‌పై చర్యలకు కాంగ్రెస్‌కు 24 గంటల సమయం
  • విఫలమైతే ఇండియా కూటమి నుంచి తొలగించే విషయాన్ని చర్చిస్తామన్న ఆప్

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: రాజ్యసభ సభ్యు డు అజయ్ మాకెన్‌పై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ అల్టిమేటం జారీ చేసింది. లేదంటే కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి నుంచి తొలగించే విషయాన్ని కూటమిలోని ఇతర పార్టీలతో చర్చిస్తామని ఆప్‌ప్రకటించింది. ఢిల్లీ సీఎం అతిశీ తమ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజీవ్ సింగ్‌తో కలిసి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంజీవ్ సింగ్ మాట్లాడుతూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌ను జాతి వ్యతిరేకి అని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అజయ్ మాకెన్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకెన్ తన అన్ని పరిమితులు దాటి మాట్లాడారని ఆక్షేపించారు. కేజ్రీవాల్‌పై తప్పుడు ఆరోపణలు చేసినందు కుగాను మాకెన్‌పై 24 గంటల్లోగా కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ అతనిపై చర్యలు తీసుకోకుంటే ఆ పార్టీని ఇండియా కూటమి నుంచి తొలగించే విషయాన్ని ఇతర పార్టీలతో చర్చిస్తామని పేర్కొన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని సింగ్ ఆరోపించారు. బీజేపీ స్క్రప్ట్‌నే మాకెన్ చదివారని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల కోసం బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని సీఎం అతిశీ ఆరోపించారు. సందీప్ దీక్షిత్ సహా మరికొందరు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం బీజేపీ డబ్బులు ఖర్చు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. మేము జాతి వ్యతిరేకులమని భావిస్తే లోక్‌సభ ఎన్నికల్లో తమతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. 

మాకెన్ ఎమన్నారంటే..

ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయడం లో ఆప్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ  బుధవారం కాం గ్రెస్ 12 పాయింట్లతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ మీడియా తో మాట్లాడుతూ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చేసి ఆప్ అధికారంలోకి వచ్చిందని, అయితే ఢిల్లీలో జనలోక్‌పాల్ ఏర్పాటు చేయడంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. ప్రజలను కేజ్రీవాల్ మోసగిస్తున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా మోసాలకు రారాజు ఎవరైనా ఉన్నారంటే అది కేజ్రీవాలే అని మాకెన్ ఆరోపించారు. 2013 ఎన్నికల్లో ఆప్ సపోర్ట్ ఇవ్వడం వల్లే ఢిల్లీ తమ పార్టీ బలహీనపడిందని పేర్కొన్నారు.