న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం విడుదల చేసింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను వీడిన ఆరుగురికి తొలి జాబితాలో చోటు దక్కింది. బీజేపీ నాయకులు బ్రహ్మ్‌సింగ్ తన్వర్, అనిల్ ఝా, బిబి త్యాగి, కాంగ్రెస్ నాయకులు చౌదరి జుబేర్ అహ్మద్, వీర్ ధింగన్, సుమేష్ షోకీన్ ఇటీవల ఆప్ లో చేరిన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ ప్రకటన కీలక సభ్యుడు కైలాష్ గహ్లోట్ రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన కొద్ది రోజులకే వచ్చింది.
ఆప్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేసిన గహ్లోట్ ఫిబ్రవరి 2025 ఢిల్లీ ఎన్నికలకు ముందు తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామాపై స్పందించిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశ రాజధాని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం భారతీయ జనతా పార్టీకి లేదని విమర్శించారు. 2025 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ని ఓడించేందుకు బీజేపీ ఏమైనా చేస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందిన తరువాత తన పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్, ఏదో ఒక రోజు ఢిల్లీ ప్రజలందరూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కావాలనేది తన కలన్నారు. మరోవైపు తమ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా ఎన్నికల్లో ఆప్ ఓడిపోతుందని కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి చేసింది.
ఆప్ అభ్యర్థుల మొదటి జాబితా
అభ్యర్థులు - నియోజకవర్గం
బ్రహ్మ్ సింగ్ తన్వర్ - ఛతర్పూర్
అనిల్ ఝా - కిరారి
దీపక్ సింగ్లా - విశ్వాస్ నగర్
సరితా సింగ్ - రోహతాస్ నగర్
బీబీ త్యాగి - లక్ష్మి నగర్
రామ్ సింగ్ నేతాజీ - బదర్‌పూర్
చౌదరి జుబేర్ అహ్మద్ - సీలంపూర్
వీర్ సింగ్ ధింగన్ - సీమాపురి
గౌరవ్ శర్మ - ఘోండా
మనోజ్ త్యాగి - కరవాల్ నగర్
సుమేష్ షోకీన్ - మతియాలా