చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి(AAP MLA Gurpreet Gogi) పంజాబ్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. లూథియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గోగి శుక్రవారం రాత్రి తన ఇంటి వద్ద తుపాకీ కాల్పులతో మరణించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, తుపాకీ కాల్పుల శబ్దం వినడంతో వారు తనిఖీ చేయగా గోగి తలపై తుపాకీ గాయాలతో కనిపించారు. అతడిని తక్షణమే దయానంద్ మెడికల్ కాలేజ్(Dayanand Medical College) అండ్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 58 ఏళ్ల గుర్‌ప్రీత్ గోగి తలపై తుపాకీ గుండుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని తలలో రెండు బుల్లెట్లు లభ్యమైనట్లు అధికారులు నిర్ధారించారు. అనుకోకుండా తుపాకీ డిశ్చార్జ్ అయి ఉండవచ్చని పేర్కొంటూ, ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (Deputy Commissioner of Police) జస్కరన్ సింగ్ తేజ మాట్లాడుతూ, ఈ సంఘటన అర్ధరాత్రి జరిగింది. మేము ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నాము. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆయన మృతికి గల అధికారిక కారణాలు వెల్లడవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆయన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్(Punjab Assembly Speaker) కుల్తార్ సింగ్ సంధ్వన్‌తో పాటు ఎంపీ సంత్ బాబా బల్బీర్ సింగ్ సీచెవాల్‌తో లూథియానాలో బుద్ధా నుల్లా స్వచ్ఛతా డ్రైవ్ కోసం సమావేశమయ్యారు. ప్రాజెక్టు జాప్యంపై మనస్తాపానికి గురైన గోగి 2022లో తాను వేసిన బుద్దా నుల్లాలో పైపులైన్ ప్రాజెక్టు శంకుస్థాపనను గతేడాది ధ్వంసం చేశారు. ఆయన నిన్న ప్రాచీన శీతల మాత మందిరాన్ని సందర్శించి, రెండు రోజుల క్రితం ఆలయంలో వెండిని అపహరించిన దొంగలపై చర్యలు తీసుకుంటానని భక్తులకు హామీ ఇచ్చారు. గోగి 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. రెండుసార్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే(Former Congress MLA), అప్పటి సిట్టింగ్ క్యాబినెట్ మంత్రి భరత్ భూషణ్ అషును అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓడించారు. ఎమ్మెల్యే కాకముందు రెండుసార్లు ఎంసీ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ జిల్లా (అర్బన్) అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన భార్య సుఖ్‌చైన్ కౌర్ గోగి ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఇందర్‌జిత్ సింగ్ ఇందీ చేతిలో ఓడిపోయారు.
గురుప్రీత్ గోగి మృతిపై కేజ్రీవాల్ సంతాపం
గురుప్రీత్ గోగి మృతిపై ఆప్ అధ్యక్షుడు, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లూథియానా ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి బస్సీ జీ అచంచలమైన అంకితభావం, కరుణతో తన ప్రజలకు సేవ చేసిన నాయకుడని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబం, లూథియానా ప్రజలకు అండగా ఉంటామని కేజ్రీవాల్ వెల్లడించారు.
పంజాబ్ ఆప్ అధ్యక్షుడు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అమన్ అరోరా(Minister Aman Arora) ఎక్స్ లో ఇలా వ్రాశారు. లూథియానా నుండి ఎమ్మెల్యే అయిన గురుప్రీత్ గోగి బస్సీని కోల్పోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్లిష్ట సమయంలో దుఃఖిస్తున్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారు భరించే శక్తిని పొందాలని కోరుకుంటున్నాను ఈ బాధాకరమైన నష్టం ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన మృతి పట్లు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.