calender_icon.png 4 March, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆప్ అవినీతిమయం!

26-02-2025 12:00:00 AM

అవినీతిరహిత పాలనను అందిస్తామన్న హామీతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిందో మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలు బట్టబయలు చేశాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ పాలసీ కుంభకోణంతో పాటుగా ముఖ్యమంత్రి అధికార నివాసం ‘శీష్‌మహల్’కు మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం, వివిధ శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించి 13 కాగ్ నివేదికలను కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

ఈ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా ఆప్ అవినీతిని బట్టబయలు చేసి ఆ పార్టీని ఖతం చేయాలనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ఈ కాగ్ నివేదికలు వెలికిరాకుండా చూడడానికి ఆప్ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేసిందన్న ఆరోపణలు న్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నివేదికలు లీక్ కావడం, అవి బీజేపీకి పెద్ద ప్రచారాస్త్రంగా మారడం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటుగా కేజ్రీవాల్ పార్టీని భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో ఉన్నటు కనిపిస్తోంది. ఇప్పుడు పంజాబ్‌లోనూ మాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంనుంచి పుట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీ అదే అవినీతి ఊబిలో పీకల్లోతు కూరుకుపోవడం విచిత్రం. పార్టీ పెట్టీ పెట్టగానే అధికారం రుచిచూసిన కేజ్రీవాల్ విద్యావ్యవస్థలో పెనుమార్పులు, మొహల్లా క్లినిక్‌లు లాంటి పథకాలతో ఢిల్లీ ప్రజలకు చేరువయ్యారు. దీంతో రెండోసారి తిరుగులేని మెజారిటీతో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇదే ఫార్ములాను ప్రయోగించి దేశంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనే ఆలోచన కేజ్రీవాల్ బుర్రలో మెదిలింది.

అంతే.. 2022 గోవా , పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయడానికి సిద్ధమైపోయారు. అదే ఆయన పతనానికి ఒక విధంగా కారణమైంది. గోవా ఎన్నికల్లో  ప్రచారానికి అవసరమైన నిధుల వేటలోనే లిక్కర్ స్కామ్‌కు అంకురార్పణ జరిగింది.  దీనిలో భాగంగా ‘సౌత్‌లాబీ’నుంచి వందకోట్ల ముడుపులు అందుకొన్నట్లు ఆరోపణలు రావడం జరిగింది. ఫలితంగా పాలసీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మొదలుకొని పలువురు నేతలే కాక చివరికి సీఎం కేజ్రీవాల్ కూడా కటకటాల పాలు కావలసి వచ్చింది.

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2 సీట్లు దక్కించుకున్న ఆప్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి కేజ్రీవాల్ వైఖరిలో భారీమార్పు వచ్చింది. తనను జాతీయ నాయకుడిగా ఊహించుకుంటూ ప్రతిపక్ష ఇండియా కూటమిలో ని అన్ని పార్టీలకు దూరమయ్యారు. ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచే పార్టీ కనిపించడం లేదు.

ఇక ‘ శీష్ మహల్’గా వార్తల్లోకి ఎక్కిన సీఎం అధికార నివాసం మరమ్మతుల వ్యవహారం కూడా కేజ్రీవాల్ పతనానికి మరో కారణం. 2020 సంవత్సరంలో రూ.7.91 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ మరమ్మతులు 2022 నాటికి ఏకంగా రూ.33.66 కోట్లకు పెరిగిపోయాయి. దేశమంతా కొవిడ్ మహమ్మారితో వణికి పోతున్న సమయంలో ఇంత భారీ మొత్తంలో అధికార నివాసానికి మరమ్మతులు చేపట్టడం పెద్ద దుమారాన్నే రేపింది.

మరోవైపు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మొహల్లా  క్లినిక్‌లు, తాగునీటి కుంభకోణం, కాలుష్య నియంత్రణలో వైఫల్యం, విద్యా విధానంలో డొల్లతనం ఇలా ఒక్కోటిగా అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి.వీటికి తోడు లెఫ్టెనెంట్ గవర్నర్ సక్సేనాతో ఎడతెగని వివాదాలు. ఫలితంగా ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పతనాన్ని చవిచూసిన అవినీతి పార్టీగా ఆప్ మిగిలిపోయింది. రాబోయే రోజుల్లో ఆ పార్టీ నేతలు మరెంతమంది కేసులను ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.