calender_icon.png 23 February, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆప్ వైఫల్యమే బీజేపీ విజయరహస్యం

11-02-2025 12:00:00 AM

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాభవం పాలవగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుం ది. ఈ ఫలితాల వెనుక కేవలం ప్రచార వ్యూహాల ప్రభావమేకాక పాలనా వైఫల్యాలు, రాజకీయ పోరు, ఆదర్శ రాహిత్యం వంటి అంశాలూ ఉన్నాయి. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఆప్, ఇటీవలి కాలంలో అవే ఆరోపణలను ఎదుర్కొంది.

మద్యం పాలసీ వివా దం, మనీష్ సిసోడియా అరెస్టు, అరవింద్ కేజ్రీవాల్‌పై కేసులు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి. రాజకీయంగా ప్రేరేపితమైనా కాకపోయినా, అవినీతిపై పోరాటం చేస్తామని వచ్చిన పార్టీపై అవినీతే ప్రధాన ఆరోపణ రావడం ఓటర్ల నమ్మకాన్ని దెబ్బతీసింది.

ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల అభివద్ధిని ప్రచారం చేసినా, ఆప్ పాలనలోని లోపాలు బహిర్గతమయ్యాయి. నగరంలోని రవాణా సమస్యలు, ఉపాధి హామీల్లో వైఫల్యం, వరదలు, కాలుష్య నియంత్రణలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమవ్వడం బీజేపీకి అనుకూలంగా మారింది. ముఖ్యంగా, లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆప్ నిరంతరం గుదిబండగా మారడం ప్రజల్లో అసంతృప్తిని పెంచింది.

కేంద్రంపై ఒత్తిడి చూపించినా, ఢిల్లీ అభివృద్ధిలో పెద్దగా సాధించింది ఏమీ లేదు. పార్టీ అంతర్గత వ్యవహారాలు కూడా ప్రతికూలంగా మారాయి. కేజ్రీవాల్ ఆధిపత్యం పెరగడంతో, బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం అభివృద్ధి కాలేదు. కుమార్ విశ్వాస్ వంటి వ్యక్తులను అట్టహాసంగా తప్పించుకోవడం ఆప్ కిందిస్థాయి కార్యకర్తల్ని నిరుత్సాహ పరిచింది.

అదనంగా, హిందుత్వ, మత రాహిత్య స్థితి మధ్య చతికిలపడ్డ ఆప్ ఏ వర్గాన్నీ సంపూర్ణంగా ఆకర్షించలేక పోయింది. మరోవైపు ఆలయ దర్శనాలు, రామరాజ్యం అనే మాటలు బీజేపీ అనుకూల ఓటర్లను ప్రభావితం చేయలేక పోయా యి. అదే సమయంలో, మత స్వాతంత్య్రాన్ని ఆశించిన ఓటర్లలో అనిశ్చితిని పెంచాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టను బీజేపీ సమర్థవంతంగా వినియోగించుకుంది. ఆప్ ఇప్పటికైనా తన తప్పిదాలను అర్థం చేసుకుని, మార్గ సంధానానికి సిద్ధమైతేనే భవిష్యత్తులో బలమైన ప్రత్యామ్నాయంగా నిలవగలదు. 

 డా. కోలాహలం రామ్‌కిశోర్