తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు అధికారులు ఆప్‌ను అష్టదిగ్బంధనం చేసినా 43 శాతం ఓట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీదే నైతిక విజయం అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ పేర్కొన్నారు. ఈ డిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, తాము ఓటమి చెందినప్పటికి దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. అప్ అమలు చేసిన వైద్యం, విద్య, విద్యుత్ విధానాలను బీజేపీ పార్టీ బేషరతుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో ఆప్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ... అక్రమాలు, ఎన్నికల సమయంలో అవకతవకలు, నిరంకుశ విధానాలపై ఆప్ బీజేపీపై యుద్దం కొనసాగుతుందని అన్నారు. డిల్లీ ఎన్నికల పలితాల కోసం భారత్ మాత్రమే కాకుండా ప్రపంచదేశాలన్నీ ఎదురు చూశాయని, తాము అధికారం చేపట్టిలేకపోయినా నైతిక విజయం ఆప్ అని తెలిపారు. తమ పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మంత్రుకలు సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి ముఖ్యమైన నాయకులను అక్రమంగా జైళ్లో నిర్భంధించారు. ఎన్నికల్లో బీజేపీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.
ఇన్ని చేసినా మాకు 43 శాతం ఓటు రావడమంటే ప్రజల మద్దతు లభించిందన్నారు. డిల్లీలో తాము అవలంభించిన వైద్యం, విద్య, విద్యుత్, మంచినీరు సరఫరాకు సంబంధించి సరికొత్త విధానాలను డిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఓడినప్పటికి 2029లో ప్రధాన మంత్రి స్థానం లక్ష్యంగా ఆప్ పార్టీ పనిచేస్తుందని అన్నారు.