02-05-2024 01:17:27 AM
కాంగ్రెస్‌వి అడ్డగోలు హామీలు
జిల్లా తీసేస్తానంటున్న సీఎం మెడలు వంచాలి
రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ
ఎన్నికల సంఘం నిషేధం అన్యాయం
ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్రానికి అన్యాయం జరుగనివ్వను
మహబూబాబాద్ రోడ్‌షోలో బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్
వరంగల్, మే 01 (విజయక్రాంతి): ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆగం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్‌షోలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. తన ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని స్పష్టంచేశారు. గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జిల్లాగా ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత సీఎం జిల్లా తీసేస్త అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడంతోపాటు సీఎం మెడలు వంచాలంటే బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాని కోరారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన పథకం మంచిదే అయినా ఆటో వాళ్ల బతుకులు ఆగం అయ్యాయని విమర్శించారు. ఈ పథకాన్ని తాము వద్దంటలేమని, ఆటోవాలాలకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు ఆగం
కాంగ్రెస్ దుష్టపాలనకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. మోదీ పాలనలో దేశంలో ఏ పనీ జరుగలేదని విమర్శించారు. నరేంద్రమోదీ గోదావరి నదిని ఎత్తుకపోత అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు మూసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే కృష్ణా నదిని అప్పజెప్పారని, గ్రామాల్లో మురికినీరు వస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎనిమిదేళ్లు గ్రామాల్లో పుష్కలంగా ఉన్న కరెంటు, మిషన్ భగీరథ నీళ్లు ఇప్పుడు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. గిరిజనుల కోసం హైదరాబాద్‌లో బంజారా భవన్ కట్టుకోవడమే కాకుండా పది శాతం రిజర్వేషన్లు అమలు చేశామని, తండాలను పంచాయతీలుగా చేశామని గుర్తుచేశారు. సీఎం మెడలు వంచాలంటే బీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవితను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు మాలోత్ కవిత, రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్, వద్దిరాజు రవిచంద్ర, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, అంగోత్ బిందు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.