19-03-2025 02:03:37 AM
న్యూఢిల్లీ, మార్చి 18: ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు భారత ఎన్నికల కమిషన్(ఈసీ) మంగళవారం ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950, ఆధార్‌పై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఈ అనుసంధాన ప్రక్రియను చేపట్టనున్నట్టు వెల్లడించింది.
కేంద్ర హోం శాఖ కార్యదర్శి, లెజిస్లేచర్ కార్యదర్శి( న్యాయశాఖ), ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవో, ఈసీ సాంకేతిక నిపుణులతో ఈసీ మంగళవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానించే విషయంపై చర్చింది.
ఈ క్రమంలోనే అనుసంధానానికి సంబంధించి సాంకేతిక అంశాలను చర్చించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ), ఈసీ సాంకేతిక నిపుణులు త్వరలో సమావేశమవుతారని ప్రకటనలో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కును కల్పిస్తుండగా ఆధార్ వ్యక్తి గుర్తింపును ధ్రువీకరిస్తున్నట్టు తెలిపింది.
ఈ క్రమంలోనే ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్లు 23(4), 23(5), 23(6)తోపాటు ఆధార్‌పై సుప్రీం కోర్టు 2023లో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. అంతేకాకుండా స్వచ్ఛంద అనుసంధానానికి మాత్రమే చట్టాలు అనుమతిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.