28-04-2025 01:52:40 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 27: పహల్గాం దాడి నేపథ్యంలో బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాళీమాత ఆలయాన్ని నిర్వహించే ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆలయానికి ప్రతిరోజు రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్, వికారాబాద్ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇటీవల ఉగ్ర దాడి నేపథ్యంలో ఆర్మీ అధికారులు అప్రమత్తమైనట్లు సమాచారం.
కాళీమాత అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల వద్ద ఆధార్ కార్డులను తనిఖీ చేస్తున్నారు. ఆలయం గేటు వద్ద సంబంధిత అధికారులు భక్తులకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లేవారు విధిగా తమ ఆధార్ కార్డులను తమతో పాటు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. భక్తులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.