రైతు రుణమాఫీ దేశంలోనే రికార్డు
వచ్చే నెలలో రూ.2 లక్షలు మాఫీ
కాంగ్రెస్ నిబద్ధతకు ఇదే నిదర్శనం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
రెండో విడుతలో లక్షన్నర రుణమాఫీ ప్రారంభం
6.40 లక్షల రైతులకు 6,198 కోట్లు
కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు అద్దం పట్టిందని, తెలంగాణలోని రైతులందరికి రుణ విముక్తి కల్పిం చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రెండు లక్షల రుణభారం తీర్చితే వారు సంతోషంగా వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెడుతారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతామని ప్రకటించారు.
12 రోజుల్లో రూ.12 వేల కోట్ల రుణం మాఫీచేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. రైతుల బాగోగుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని తెలిపారు. రుణమాఫీ కోసం ఏకకాలంలో రూ.31 వేల కోట్లు కేటాయించి తమ ప్రభుత్వం దేశ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు జరగడం లేదని, తమకు రాజకీయ ప్రయోజ నాల కంటే రైతు ప్రయో జనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణం నుంచి రెండో విడుతగా లక్షన్నర రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షం లో పలువురు రైతులకు చెక్కులు పంపిణీ చేసి సంబురాలు జరిపారు.
వరంగల్ డిక్లరేషన్ అమలు చేశాం
2022 మే 6వ తేదీన వరంగల్ రైతు డ్లికరేషన్‌లో ఇచ్చిన హామీని 8 నెలల్లోనే అమ లు చేశామని సీఎం తెలిపారు. దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని దివాళా తీసినట్లు మోసం చేశాయని, గత 10 ఏళ్లలో బ్యాంకులకు దాదాపు రూ.14 లక్షల కోట్లు ఎగవేశా యని తెలిపారు. పదిమందికి అన్నం పెట్టే రైతులు మాత్రం పంట దిగుబడి రాక, గిట్టుబాట ధర లేక అప్పులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం దెబ్బతిని కొందరు రైతులు ఆత్మ హత్యలకు పాల్పడిన విషాద ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. అందుకే రైతు కుటుంబాల్లో ఆనందం నిలపాలని రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు.
రుణమాఫీపై భట్టిది ఎంతో చొరవ
గత ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు ప్రభుత్వం ఎనిమిది నెలల్లో రూ. 43 వేల కోట్లు కిస్తీలు చెల్లించిందని సీఎం తెలిపారు. కేవలం 12 రోజుల్లో రైతుల ఖాతా ల్లో రూ.12 వేల కోట్లకుపైగా నిధులు జమచేసిన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఆ శాఖ అధికారుల బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రైతు రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్లలోపు ఉచిత గృహ విద్యుత్తు, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నామని వెల్లడించారు.
లక్షలాది రైతుల ఇళ్లలో పండుగ
లక్షన్నరలోపు పంట రుణాలున్న రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 6.40 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,198 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. రుణ విముక్తి పొందిన లక్షలాది రైతుల తమ ఇళ్లలో పండుగ జరుపుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రైతు రుణమాఫీ పథకంలో బాగంగా జూలై 18న తొలి విడుతగా రూ.లక్షలోపు రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. మొదటి విడతలో 11 లక్షల మంది రైతులకు రూ.6,098 కోట్లు మాఫీ చేసింది. 12 రోజుల వ్యవధిలో రెండో విడుతగా మరో రూ.6,198 కోట్లు విడుదల చేసింది.
గత సర్కార్ రుణమాఫీ నిర్లక్ష్యం చేసింది
గత ప్రభుత్వం రూ.లక్ష రైతు రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేకపో యిందని సీఎం రేవంత్ విమర్శించారు. మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు నాలుగు విడుతల్లో మాఫీ చేస్తే రైతులు తమ అప్పుకు మించి మిత్తీలు కట్టాల్సి వచ్చిందని విమర్శించారు. రెండోసారి అదే హామీతో అధికారంలో వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.19 వేల కోట్లు ఇస్తామని చెప్పి , రూ.12 వేల కోట్లు విడుదల చేసిందని తెలిపారు. దాదాపు రూ.7వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టిందని విమర్శించారు. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఎలా రుణ మాఫీ చేస్తుందని కొందరు తమను అవహేళన చేశారని, కానీ తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు నెలలోగా రుణమాఫీకి ప్రణాళిక ప్రకారం నిధులను సమీకరించిందని చెప్పారు. ఇది తమ ప్రభుత్వం చిత్తశుద్ధి, నిబద్ధతలకు నిదర్శమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజల మేలు కోసం ప్రభుత్వం తపిస్తుంది: భట్టి
ప్రజల మేలు కోసం తమ ప్రభు త్వం ఎంతగా తపిస్తుందో చెప్పడానికి రుణమాఫీ కార్యక్రమం ఒక ఉదాహరణ అని డిఫ్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆగస్టు చివరికల్లా రూ.రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. రైతు బీమా ప్రీమియం డబ్బులు రైతుల పక్షా న ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లుగా గాలికి వదిలేసిన పంటల బీమా పథకాన్ని తాము అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు బీమా కింద 42 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,580 కోట్ల ప్రీమి యం ప్రభుత్వం త్వరలో చెల్లిస్తుందని తెలిపారు.
రైతును రాజును చేస్తాం: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు ప్రభుత్వానిదే బాధ్యత అని, బీమా పథకం ఖచ్చితంగా అమలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఎంతటికైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. త్వరలో పంట బీమాకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తామని ప్రకటించారు. ఇందుకు అవసరమైతే ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటుచేసి వారి సూచనలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అన్ని పంటలకు ప్రీమియం ప్రభుత్వం భరిస్తుందని, రైతు ల పంట నష్టపోతే బీమా పథకం ద్వారా పరిహారం ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసాపై అభిప్రాయాలు తీసుకున్నామని, త్వరలో ఒక నిర్ణయం తీసుకుం టామని వెల్లడించారు. ఆయిల్ పామ్ సరఫరాలో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో అధికా ర పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.