09-04-2025 12:00:00 AM
అల్లు అర్జున్ హిట్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేస్తున్నట్టు ఇన్నాళ్లూ వచ్చిన వార్తలను నిజం చేస్తూ బన్నీ పుట్టిన రోజున అభిమానులకు శుభవార్త అందింది. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడయింది. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ మేరకు ఆ సంస్థ బన్నీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ ప్రాజెక్టు వివరాలను పంచుకుంటూ సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ‘ఏఏ22’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి పట్టాలెక్కించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈలో గా అల్లు అర్జున్ మేకోవర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. ఈ మేరకు అట్లీ, అల్లు అర్జున్ లాస్‌ఏంజెలెస్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థను సంప్రదించారు. వీఎఫ్‌ఎక్స్ నిపుణులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇలాంటి స్క్రిప్ట్ చూడలేదని పేర్కొన్నారు. విజువల్స్ హాలీవుడ్ తరహాలో ఉండనున్నట్టు తెలిపారు. అల్లు అర్జున్‌కు స్క్రీన్ టెస్ట్ చేసిన విజువల్స్ ఇందులో చూపించడం విశేషం.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సహాయంతో బన్నీ ముఖాన్ని రీక్రియేట్ చేశారు. కొన్ని సన్నివేశాలకు సంబంధించి టెస్ట్ షూట్ కూడా జరిగింది. అల్లు అర్జున్ ఇందులో ప్రోస్థటిక్ మేకప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోనూ ఎమోషన్స్, మాస్ యాక్షన్‌కు తోడు భారీ వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలు ఉంటాయని టాక్. ప్రస్తుతం మహేశ్‌బాబు కాంబోలో రూపొందుతున్న సినిమా బడ్జెట్ రూ.వెయ్యి కోట్లు అని సినీవర్గాల అంచనా.
అయితే, ఈ ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ తర్వాత అల్లు అర్జున్ కలయిలో రూపొందు తున్న ప్రాజెక్టే అత్యంత ఖరీదైనదని అర్థమవుతోంది. బన్నీ కాంబో ప్రాజెక్టును రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
ఇందులో అల్లు అర్జున్ పారితోషికం రూ.175 కోట్లు అని వినికిడి. దీంతోపాటు లాభాల్లో మరో 15 శాతం కూడా బన్నీకి అందుతుందంటున్నారు. అట్లీ రూ.100 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. ఈ రెమ్యూనరేషన్ల తర్వాత సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టు వీఎఫ్‌ఎక్స్ కోసం అత్యధికంగా రూ.250 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్తున్నారు.
అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకల సందడి..
పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోను అతని భార్య స్నేహరెడ్డి సోషల్ మీడియాలో పంచుకోగా, వైరల్‌గా మారింది. పలువురు సినీపరిశ్రమ ప్రముఖులు, అభిమానులు కూడా అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట పోస్టులు పెట్టారు. మరోవైపు అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అభిమానులతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది.