calender_icon.png 29 October, 2024 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

14-07-2024 12:54:36 AM

  1. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు
  2. అందరూ బాధ్యత తీసుకొంటేనే నిర్మూలన
  3. విద్యాసంస్థల్లో కేరళ మాదిరి మోరల్ పోలీసింగ్
  4. డ్రగ్స్ ఎక్కడ కనిపించినా పోలీసులకు తెలుపండి
  5. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
  6. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం  

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని నెట్‌వర్క్‌ను ఉక్కుపాదంతో అణచివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు డీజీపీ స్థాయి ఉన్నతాధికారితో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమాజంలో పెడధోరణులకు మాదక ద్రవ్యాలు కూడా ఒక కారణమని అన్నారు. నేరాలను నియంత్రించడం, నిర్మూలించడం ఒక్క పోలీస్ వ్యవస్థతోనే కాదని, ప్రతి ఒక్కరూ అందుకు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

జేఎన్టీయూలో శనివారం డ్రగ్స్ నియంత్రణ మహిళ భద్రతపై ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఎస్ స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, డిజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. యూనిఫాం ఉన్న పోలీసులే కాదు, యూనిఫామ్ లేని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కూడా పోలీసులే అని చెప్పారు. సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణంగా మారిందని, పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలను నివారించవచ్చని తెలిపారు. కుటుంబ వ్యవస్థ విచిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలకు కారణమని చెప్పారు. చిన్నారుల మానసిక దృఢత్వానికి ఉమ్మడి కుటుంబం తోడ్పడుతుందని అన్నారు. పిల్లలను మానసికంగా సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

పిల్లలకు సోషల్ పోలీసింగ్ నేర్పించాలి

పిల్లలకు సోషల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ నేర్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై సీరియస్‌గా అందరూ దృష్టి సారించాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీల్లో సబ్జెక్ట్‌తోపాటు మోరల్ పోలీసింగ్ కూడా నేర్పిం చాలని కోరారు. పిల్లల ప్రవర్తనలో మార్పు లు గమనించే వ్యవస్థ ఉండాలని అన్నారు. ఇళ్ల దగ్గర, కళాశాలల వద్ద డ్రగ్స్‌ను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాజంతోపాటు విద్యార్థులందరి భాగస్వామ్యంతోనే తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చగలమని పేర్కొన్నారు. సింగరేణి కాలనీలో ఓ చిన్నారిపై జరిగిన అఘాయిత్యం గంజాయి మత్తు లోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. పాఠశాలల వద్ద గంజాయి చాక్లెట్లను విక్రయిస్తు న్నారని, దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

కాలేజీల్లో పోలీసింగ్ వ్యవస్థ

స్కూళ్లు, కాలేజీల్లో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్ అవసరం ఎంతో ఉందని సీఎం తెలిపారు. అన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారంలో రెండు రోజులు మోరల్ పోలీసింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ తరహా వ్యవస్థతో కేరళలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసిందని సీఎం చెప్పారు. ‘డ్రగ్స్‌పై ప్రభుత్వం యుద్ధమే ప్రకటించింది. మీ అన్నగా పిలుపునిస్తున్నా.. డ్రగ్స్ నిర్మూలనకు సహకరిం చండి’ అని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను, విద్యార్థులను సీఎం కోరారు. 

ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం

రాష్ర్ట ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియం ఏర్పాటుచేయాలని భావిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. క్రీడల ద్వారా కూడా ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు. క్రికెటర్ సిరాజ్‌తోపాటు మరికొంత మంది క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

మీరెందుకు రేవంత్‌రెడ్డిలా కాకూడదు?

ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యత అని సీఎం చెప్పారు. ప్రజా సమస్యలపై ఫోకస్‌గా పనిచేయడం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని విద్యార్థులకు వివరించారు. తాను కార్పొరేట్ స్కూల్‌లోనో, అమెరికా యూనివర్సిటీలోనో చదు వుకోలేదని చెప్పారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కాలేజీలో చదువుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కి సీఎం అయ్యానని అన్నారు. 16 సంవత్సరాలు కష్టపడితే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. సమస్యలకు భయపడి పారిపోవద్దని, నిలబడి పోరాడాలని యువతకు సూచించారు. ‘నరేంద్ర మోదీకైనా, బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డికైనా రోజుకు 24 గంటలే ఉంటాయి. మీరెందుకు సీఎం రేవంత్‌రెడ్డి, పీఎం, డీజీపీలా కాకూడదు? మన జీవితం మన చేతుల్లోనే ఉంది.. జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.