చెల్లెలిని ఎప్‌సెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా ఘటన
వరంగల్ తూర్పు, మే11: తన చెల్లెలిని ఎప్‌సెట్ పరీక్ష రాసేందుకు తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థిని నాగపురి తన్మయి(23).. ఘట్ కేసర్ ప్రాంతంలోని ఓ కళాశాలలో ఎప్‌సెట్ పరీక్ష రాయాల్సి ఉన్న తన చెల్లి సాయి హర్షితను తీసుకొని శనివారం తెల్లవారు జామున కారులో హైదరాబాద్ బయలుదేరారు.
వీరితో తల్లి కూడా ఉన్నారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద ముందు వెళ్తున్న వ్యాన్‌ను వీరి కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన తన్మయిని స్థానికులు ౧౦౮ వాహనంలో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. తల భాగంలో బలమైన గాయాలు, అధిక రక్తస్రావం కావడంతో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తన్మయి వరంగల్ శివారులోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కండ్ల ముందే విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.