23-02-2025 08:00:36 PM
హుస్నాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన వరుకోలు కళాధర్ ప్రతిష్టాత్మక యూజీసీ నెట్-పీహెచ్‌డీ పరీక్షలో ఉత్తీర్ణుడై, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ)కి అర్హత సాధించాడు. పోటీ ఎక్కువగా ఉండే ఈ పరీక్షలో విజయం సాధించడం కళాధర్ అసాధారణ విద్యాభ్యాసాన్ని, కృషిని, పట్టుదలను తెలియజేస్తోంది. విశేషం ఏమిటంటే, ఆయన ఎటువంటి కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే స్వయంగా చదివి ఈ విజయం సాధించాడు. అంతేకాకుండా, ఆయన తన విద్యా ప్రయాణంలో వైవిధ్యాన్ని కనబరిచాడు.
ఒకవైపు రెగ్యులర్ విద్య ద్వారా బీటెక్ పూర్తి చేయగా, మరోవైపు దూరవిద్య ద్వారా చరిత్ర విజ్ఞానశాస్త్రంలో పీజీ (ఎం.ఎ-హిస్టరీ) పట్టా పొందాడు. ఇప్పుడు యూజీసీ నెట్-పీహెచ్‌డీ అర్హత సాధించడం ద్వారా, విద్యకు ఒకే మార్గం ఉండాలనే నియమం లేదని నిరూపించాడు. ఈ అర్హతతో భవిష్యత్తులో ఆయన అధ్యాపక వృత్తిని, పరిశోధనను చేపట్టడానికి ఆయనకు అవకాశం లభించింది. తనకు తన తండ్రి సీనియర్ జర్నలిస్ట్ వరుకోలు కళాచందర్, తల్లి దేవేంద్ర ప్రోత్సాహాన్ని అందిస్తుండడంతోనే తాను రాణిస్తున్నానని కళాధర్ అన్నాడు.