calender_icon.png 29 April, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్టుకు వేలాడుతూ.. యువకుడి వినూత్న నిరసన

29-04-2025 12:00:00 AM

 ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఘటన

 తన భూ సమస్యను పరిష్కరించాలని..

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 28: భూసమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్న సమస్య పరిష్కారం కాకావడంతో ఓ యువకుడు వినూత్నరీతిలో నిరసనకు దిగాడు. ఈ ఘటన రంగారెడ్ది జిల్లా, ఇబ్రహీంపట్నం మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన వుల్లింతల జీవన్ అనే వ్యక్తికి తండ్రి నుంచి కొంత భూమి వారసత్వంగా వచ్చింది. ఆ భూమిని 20 ఏళ్ల కిందట తన తండ్రి ఓ వ్యక్తి నుంచి సర్వే నెంబర్. 374/ఆ లో 1.32 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూమికి కొత్త పాస్ బుక్, పాత పాస్ బుక్, టైటిల్ డీడ్, పహానీ పత్రాలు అన్నీ ఉన్నా.. గతంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల కారణంగా సీలింగ్ హోల్డర్ లో ఉన్న సర్వే నంబర్ లో పడింది.

ప్రస్తుతం ఈ భూమిని అధికారులు నిషేదిత జాబితాలో చేర్చారు. ఇదిలా ఉండగా.. అసలు సీలింగ్ హోల్డర్ రెండు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడు. దీనిపై పూర్తి ఆధారాలతో రెవెన్యూ శాఖకు, కలెక్టర్, ఎమ్మార్వో, ఆర్డీఓ ఆఫీసులకే గాక ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వందకి పైగా లేఖలు రాసినా ఎలాంటి పురోగతి లేదని బాధితుడు తెలిపాడు. ఇలా సంవత్సరం పాటు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విన్నపాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయాడు.

ఎప్పటికీ 100 అప్లికేషన్లు ఇచ్చినా కూడా తన సమస్య తీరలేదని, తన సమస్యను వివరిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా బహిరంగ లేఖను రాశానని తెలిపాడు. దయచేసి ఆ భూమిని నిషేదిత జాబితా నుండి తొలగించి, మా భూమి మాకు తిరిగి ఇప్పించాలని లేఖలో కోరాడు. ఇక దీనిపై తనకు న్యాయం చేయాలని కోరుతూ.. తన భూమిలోనే ఉన్న వేపచెట్టుకు భూమి పత్రాలను కట్టడంతో పాటు అదే చెట్టుకు తాను కూడా తలక్రిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టంట వైరల్ గా మారింది.