calender_icon.png 27 November, 2024 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కల్లు సేవించి యువకుడు మృతి..

29-10-2024 11:51:59 AM

కల్తీ కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన గ్రామస్తులు

ప్రాణం ఖరీదు 3లక్షలు వెల కట్టిన కల్తీకల్లు వ్యాపారులు

పట్టించుకోని పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు

అచ్చంపేట: కల్తీ కల్లు సేవించి డిగ్రీ చదువుతున్న విద్యార్థి మృతి చెందిన ఘటనలో గ్రామస్తులు ఆగ్రహంతో కళ్ళు దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాలు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనిల్ (23) అనే యువకుడు హైదరాబాదులో డిగ్రీ చదువుతున్నాడు. దసరా సెలవుల్లో సొంత ఇంటికి వచ్చి మరుసటి రోజు నుంచే గ్రామంలో విక్రయించే కల్లు సేవించి దానికి బానిస అయ్యాడు. కల్తీ కల్లు కోసం తాపత్రయపడుతూ నిత్యం తాగి రోడ్లపై సొలుతూ తిరిగేవాడు. సోమవారం సాయంత్రం కూడా కల్లు దుకాణం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

దీంతో మృతదేహాన్ని కల్లు దుకాణం ముందు ఉంచి ఆగ్రహంతో ఆ కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న సిఐ రవీందర్ ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బాదిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా కల్తీకల్లును అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని తద్వారా యువత కల్తీకల్లుకు బానిసై దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారని మండిపడ్డారు. కలుషిత నీటితోనే ఆల్ఫాజోలం, సిహెచ్ వంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలను అధికమోతాదులో వాడుతూ కల్తీకల్లు యువతకు అంటగడుతున్నారని ఆరోపించారు. కాగా ఈ విషయంలో బాధితులను బెదిరింపులకు గురి చేసి ఫిర్యాదు ఇవ్వకుండా ప్రాణం ఖరీదుకు మూడు లక్షలు ఇస్తామంటూ ముందుగా 50వేలు బలవంతంగా అంటకట్టినట్లు తెలిసింది.