- భూమి లేనప్పుడు భాగ పరిష్కారం ఎలా ?
- ప్రభుత్వం నుంచి ‘ఆస్మాన్ జాహీపైగా’ భూములు విడుదల కాలేదని స్పష్టీకరణ
- ఇక పిటిషన్‌పై విచారణ క్లోజ్: హైకోర్టు
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): ఆరున్నర దశాబ్దాల ‘ఆస్మాన్ జాహి పైగా’ భూముల వివాదాన్ని తాజాగా హైకోర్టు పరిష్కరించింది. 1958 లో హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణను మూసివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. ప్రాథమిక డిక్రీలో భూమి ప్రస్తావన ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ భూమిని విడుదల చేయలేదని స్పష్టం చేసింది. లేని భూమి కోసం 66 ఏళ్ల పాటు పోరాటం ఎలా చేస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది.
తెలిసిన వివరాల ప్రకారం.. భూముల భాగ పరిష్కారం కోసం 1953లో సుల్తానా జహానే బేగం అనే మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషన్ 1958లో హైకోర్టుకు చేరింది. పిటిషన్‌పై 1959 ఏప్రిల్‌లో హైకోర్టు ప్రాథమి క డిక్రీ జారీ చేసింది. సదరు భూములు ప్రభుత్వం నుంచి విడుదలైన ‘ఆస్మాన్ జాహి పైగా’లో భాగం కాగా, వాటిని రిసీవర్లుగా నియమితులైన ఇద్దరు భాగ పంపిణీ చేయాలనేది డిక్రీలోని సారాంశం.
కానీ.. డిక్రీలో 25 గ్రామాల పరిధిలోని 230- 254 వరకు సర్వే నంబర్ల ఆస్మాన్ జాహి పైగాకు అనుకూలంగా ప్రభుత్వం విడుదల చేసినట్లు డిక్రీలో ఎక్కడా లేదని, విస్తీర్ణ వివరాలలో లేదని తాజాగా హైకోర్టు స్పష్టం చేసింది. కమిషనర్ ఆఫ్ సెటిట్‌మెంట్ సర్వే మక్తా భూములను రిలీజ్ చేస్తూ 1977 డిసెంబర్ 30న ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని పిటిషనర్లు వాదిస్తున్నప్పటికీ, 230- 254 వరకు సర్వే నంబర్ల విస్తీర్ణం ఎంతో పేర్కొనలేదని పేర్కొన్నది.
1977నాటి రిసీవర్ నివేదిక ఆధారంగా రాయదుర్గ్ పైగా, షంషీగూడ పైగా గ్రామాల్లోని భూములకు తుది డిక్రీ జారీ అయిందని, వాస్తవాలు పరిశీలించకుండానే నాడు నివేదిక జారీ అయిందని కొందరు పిటిషనర్లు వాదించారు. ఆ డిక్రీ ప్రకారం ఆస్మాన్ జాహి పైగా వారసుల నుంచి 25 మక్తాల భూములు కొనుగోలు చేశామని, వాటిని తమకు అప్పగించాలంటూ కోరారు. హైకోర్టు ఈ వివాదానికి తెర దించేందుకు 2022లో ప్రాథమిక డిక్రీ ఆధారంగా, తుది డిక్రీ జారీ చేసేందుకు ఇద్దరు మాజీ న్యాయమూర్తులను రిసీవర్లుగా నియమించింది.
నాడు అందుబాటులో ఉన్న భూములు మాత్రమే ‘ఆస్మాన్ జాహీ పైగా’కి విడుదలయ్యాయని, కానీ.. 230 సర్వేనంబర్ల పరిధిలోని భూములు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదని రిసీవర్లు 2023 జూలైలో నివేదిక సమర్పిం చారు. పిటిషనర్ల వద్ద 1977 నాటి ఉత్తర్వుల ప్రకారం భూమికి సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో హైకోర్టు తుది నిర్ణయానికి వచ్చింది.
ప్రభుత్వం నుంచి భూములు విడుదలైతేనే భాగ పరిష్కారం ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో 2023లో రిసీవర్లు సమర్పించిన నివేదికను ఆమోదిస్తున్నామని తేల్చిచెప్పింది. అలాగే రిసీవర్లను ఆ బాధ్యతల నుంచి విడుదల చేస్తున్నామని పేర్కొన్నది. కొనుగోలు చేసిన కక్షిదారులు చట్టప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకు వెళ్లవచ్చని సూచించింది.