calender_icon.png 31 January, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాది పాలన.. ఎడతెగని వంచన

09-12-2024 01:15:40 AM

* తిట్లు.. ఒట్లు.. తప్ప సీఎం రేవంత్‌కు ఏమీ రాదు..

* ఆరు హామీలు ఎందుకు అటకెక్కాయి?

* అన్ని పంటలకూ బోనస్ ఏమైంది?

* సన్నాలకు బోనస్ ఇచ్చి చేతులు దులుపుకూంటారా?

* దివ్యాంగులనూ మోసం చేసిన ధోఖా సర్కార్ ఇది..

* ముడుపుల లంకె బిందెల కోసమే మూసీ సుందరీకరణ

* మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

* తెలంగాణ భవన్‌లో చార్జ్‌షీట్ విడుదల

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాం తి): ఏడాది కాంగ్రెస్ పాలనలో ఎడతెగని వంచన జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రతిపక్షాన్ని తిట్టడం, దేవుని మీద ఒట్లు పెట్టడంతోనే సీఎం రేవంత్‌రెడ్డికి 365 రోజులు గడిచిపోయాయని ఎద్దేవా చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనపై ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చార్జ్‌షీట్ విడుదల చేసి మాట్లాడారు. ముడుపుల లంకెల బిందెలు దండుకునేందుకు మూసీ సుందరీకరణ అనే నాటకం తెరమీదకు వచ్చిందని ఆరోపించారు. 16 వేల కోట్లతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన పథకాన్ని పక్కనపెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్లు లూటీ చేసేందుకు కొత్త పథకాన్ని సిద్ధం చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకపోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంతూరుకు వెళ్లాలంటే స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతులు తీసుకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. సర్కార్ బుల్డోజర్లతో ఇండ్లు కూల్చి పేదల జీవితాలను ఛిద్రం చేసిందని మండిపడ్డారు. లగచర్లకు చెందిన లంబాడీ బిడ్డల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని దుయ్యబట్టారు. సీఎం కార్యాలయంలో ప్రతిరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి, ఇప్పుడు ఎగనామం పెట్టారని, ఒక్కరోజు బాగోతంగా ప్రజాదర్బార్ మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు.

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని సర్కార్ వాటిని తుంగలో తొక్కిందన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని మోసం చేశారన్నారు. ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు లేనివారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు ఇస్తామని అమలు చేయడం లేదన్నారు. ఆరు హామీలు ఇప్పుడు అటకెక్కాయని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరిట కూల్చివేతలకు పాలై సర్కార్ అభాసు పాలైందన్నారు. అరాచకాలు సృష్టించి, తర్వాత నాలుక కరుచుకుందన్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలయిందన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. అన్ని రంగాల్లో నిస్తేజం అలుముకుందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో 62 వేల కోట్ల నుంచి రాష్ట్ర బడ్జెట్  3 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. తలసరి ఆదాయం  1.24 లక్షల నుంచి 3.47 లక్షలకు పెరిగిందన్నారు. 

రుణమాఫీకి 31 రకాల సాకులు..

తెలంగాణలో రైతు సంక్షేమం నీరుగారిపోతున్నదని మాజీ మంత్రి అభిప్రాయ పడ్డారు. తాను సవాల్ చేసినందునే సీఎం రుణమాఫీపై స్పందించారని గుర్తుచేశారు. కానీ, చేతల్లో మాత్రం 50శాతం రైతులకైనా రుణమాఫీ కాలేదని స్పష్టం చేశారు. 31 రకాల సాకులు సృష్టించి రైతుల రుణాలను మాఫీ చేయలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్  ప్రభుత్వం 11 విడతల్లో 72,817 కోట్లు రైతు ల ఖాతాల్లో జమ చేసిందని గుర్తుచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్నే రైతుభరోసా అని మార్చిందని, కానీ.. అమలు మాత్రం చేయలేకపోయిందన్నారు. పైగా రైతుభరోసా పథకం పేరుతో కౌలు రైతుకు, భూయజమానికి కయ్యం పెట్టాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో అన్ని పంటలకూ బోనస్ అని ప్రకటించి, తీరా ప్రభుత్వం వచ్చాక వరి సన్నాల వరకే బోనస్ ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని దుయ్యబట్టారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఆ మాటలు నిలబెట్టుకోలేకపోయిందన్నారు.

నిరుద్యోగులకు ప్రతినెలా రూ.4 వేల భృతి అని నాడు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీతో చెప్పించి, తీరా ప్రభుత్వం వచ్చాక హామీని మరచిపోయారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో గురుకుల విద్య గొప్పగా వర్ధిల్లిందని గుర్తుచేశారు. ఇప్పుడు గురుకులాల్లో పిల్లలకు పురుగులన్నం, గొడ్డుకారమే అందుతున్నదని దుయ్యబట్టారు. అనారోగ్యంతో పిల్లలు ఆసుపత్రుల పాలవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 49 మంది గురుకుల విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుని, వారి తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చిందన్నారు.

పరిపాలనా వైఫల్యం..

కాంగ్రెస్ తిక్క పాలనలో హైదరాబాద్‌కు ముగ్గురు పోలీస్ కమిషనర్లు మారారని, జీహెచ్‌ఎంసీకీ ముగ్గురు కమిషనర్లు, రంగారెడ్డి కలెక్టర్లు ముగ్గు రు, ట్రాన్స్ కో సీఎండీలు నలుగురు మారారని మాజీ మంత్రి ఎద్దేవా చేశా రు. ముఖ్యమంత్రి రేవంత్ నిర్వహిస్తున్న విద్య, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలు నిరాదరణకు గురయ్యాయన్నారు. పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులు విషాహారం తిని ప్రాణా లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో వరదలు ముంచెత్తితే, మంత్రులు సరైన సహాయక చర్యలు అందించలేదని ఆరోపించారు.

ప్రశాంతతకు చిరునామా అయిన తెలంగాణలో ఇప్పుడు ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయని, మత సామరస్యానికి మారు పేరైన రాష్ట్రంలో మత ఘర్షణలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఆయన సోదరుల వేధింపు లతో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. దివ్యాంగులకు సైతం ధోఖా ఇచ్చిన దొంగప్రభుత్వమని నిప్పులు చెరిగారు. 

ఆదిలోనే హంసపాదులా సర్కార్ తన చేతగాని తనంతో కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించిందని ధ్వజమెత్తారు.  సాగర్ ఆయ కట్టుకు సరైన సమయంలో నీళ్లివ్వలేకపోయిందన్నారు.

సీఎం అజ్ఞానానికి నిదర్శనాలెన్నో..

హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలున్నాయని వ్యాఖ్యలు చేసి సీఎం నవ్వుల పాలయ్యారని మాజీ మంత్రి గుర్తుచేశారు. తెలంగాణలో భాక్రానంగల్ ప్రాజెక్టు ఉందని సీఎం ఒకసభలో అన్నారని, దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు అమ్ముతారని మరోచోట అన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో సంక్షేమం కునారిల్లిందని, సంక్షోభం ముంచుకు వస్తునదని అభిప్రాయపడ్డారు. ఏడాది పాలనలో తామేమి కోల్పోయామో ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నదన్నారు.

ఆడబిడ్డలు బతుకమ్మ చీరెలు కోల్పోయారని, లంబాడీలకు మంత్రివర్గంలో స్థానమే లేదన్నారు.  పేద బ్రాహ్మణులు ప్రభుత్వ సహాయాన్ని కోల్పోయారన్నారు. అమ్మ ఒడిలోనో, బడిలోనో ఆనందంగా ఉండాల్సిన పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు మొండిచేయి..

తమ పార్టీ అధికారంలోకి రాగానే మూడు పెండింగ్ డీఏలను విడుదల చేస్తామని, అలాగే పీఆర్సీ ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తమని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిందని మాజీ మంత్రి గుర్తుచేశారు. కానీ.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యకు అతీగతి లేదని వాపోయారు. పోలీసుల సరెండర్ లీవ్, టీఏ బిల్లుల కోసం వారు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తున్నదన్నారు.

ఫార్మా విలేజీల పేరుతో ప్రభుత్వం గ్రామాల్లో చిచ్చు పెట్టిందన్నారు.  బీఆర్‌ఎస్ ప్రభుత్వం సేకరించిన 14 వేల ఎకరాలను కాదని, ఫార్మా కంపెనీలను పల్లెలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సర్కార్ దోపిడీ దందాకు వ్యతిరేకంగా న్యాలకల్ రైతులు నిరసిస్తున్నారని, లగచర్ల రైతులు తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు.