- రూ.20 వేల విలువైన భూమి గజం వందకే
- ఒకరికి అమ్మిన ప్లాటు మరొకరికి రిజిస్ట్రేషన్
- బైనంబర్లతో అక్రమంగా కొత్త ప్లాట్ల ఏర్పాటు
- భాగ్యనగర్ హౌజింగ్ సొసైటీలో లీలలు
- సొసైటీలో సభ్యులుకాని వారికీ ప్లాట్ల విక్రయం
- 2008 నుంచి కొనసాగుతున్న వ్యవహారం
హైదరాబాద్, అక్టోబర్ 2౭ (విజయక్రాంతి): భాగ్యనగర్ సహకార హౌసింగ్ సొసై టీ అక్రమాల పుట్ట పగులుతున్నది. సొసైటీలో ఏండ్లుగా కొనసాగుతున్న అక్రమాలు సహకా ర శాఖ విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులో కి వస్తున్నాయి.
2008 నుంచి అంతులేని అక్రమాలు జరుగుతున్నాయని సొసైటీ సభ్యులు నెత్తినోరు మొత్తుకొని చెప్పినా పెడచెవిన పెట్టి న అధికారులు తాజాగా లోతుగా దర్యాప్తు జరుపుతుండటంతో సొసైటీ అధ్యక్ష, కార్యర్శు ల లీలలు బహిర్గతమవుతున్నాయి. సహకార శాఖ ప్రాథమిక విచారణలో వెల్లడైన అక్రమాలు ఇవీ..
* సొసైటీ మేనేజింగ్ కమిటీ రికార్డులను నిర్వహించడంలో విఫలమైంది. క్యాష్‌బుక్, అడ్మిషన్ రిజిస్టర్, ప్లాట్ల కేటాయిం పు రిజిస్టర్, జనరల్ బాడీ మీటింగులను సొసైటీ నిబంధనల ప్రకారం నిర్వహించలేదు.
* ప్లాట్ నం.117లోని 729 చదరపు గజాల స్థలాన్ని భీమశంకర్ అనే వ్యక్తికి మొదట అమ్మివేశారు. ఇందుకు సంబంధించిన మొత్తం నగదును భీమశంకర్ సొసైటీకి చెల్లించారు. అయితే ఆయనకు రిజిస్ట్రేషన్ మాత్రం చేయలేదు. పైగా ఇదే ప్లాట్‌ను భాగ్యనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట గిఫ్ట్ డీడ్ చేయించారు. దీనిపై భీమశంకర్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసులో, తరువాత కోఆపరేటివ్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసి గెలిచారు. తరువాత కోర్టు నుంచి డిక్రీ కూడా పొందారు. అయితే దీనిపై సొసైటీ హైకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం న్యాయ విచారణ జరుగుతున్నది.
* ప్లాట్ నం.32లో ఉన్న 600 గజాల స్థలాన్ని డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలని నిర్ణయించిన సొసైటీ మేనేజ్‌మెంట్ కమిటీ.. ఇందుకు అనుగుణంగా సత్యభామ ప్రాపర్టీస్‌తో ఒప్పందం చేసుకుంది. అయితే నిర్మాణ ఖర్చుల కోసం 302 ఫ్లాట్‌ను అమ్మివేసేందుకు జరల్‌బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ సొసైటీలో సభ్యులు కానప్పటికీ.. 302 ఫ్లాట్‌ను బోనం సూర్య శిరీష పేరిట 22.12.2014 నాడు రిజిస్ట్రేషన్ చేశారు.
ఫ్లాట్‌ను అమ్మగా వచ్చిన రూ.37.50 లక్షలకు లెక్కలు కూడా లేవు. ఫ్లాట్ అమ్మగా వచ్చిన మొత్తాన్ని మాయం చేసినట్టు నిర్ధారించిన అధికారులు.. ఆ మొత్తాన్ని సొసైటీ అధ్యక్షడు జీ పద్మారావు, ఉపాధ్యక్షుడు ఎస్ రాజేశ్వర్‌రావు, సెక్రెటరీ ఎం వెంకట్‌రాజు, ట్రెజరర్ సీహెచ్ రాం బాబు, మేనేజింగ్ కమిటీ సభ్యులైన డీవీవీఎస్ స్వామీజీ, సీహెచ్ నర్సారెడ్డి, కే శ్రీనివాస్‌రెడ్డి, కే నారాయణమ్మ నుంచి వసూ లు చేయాలని నివేదికలో పేర్కొన్నారు.
* ప్లాట్ నం.38లో ఉన్న 430 గజాల స్థలాన్ని సొసైటీలో సభ్యత్వం లేని పీవీ శ్రీనివాసరాజుకు 21.7.2008న రిజిస్టర్ చేశారు. ప్రాథమిక విచారణలో దీనికి బాధ్యులుగా సొసైటీ అధ్యక్షుడు జీ పద్మారావు, సెక్రెటరీ ఎం వెంకట్‌రాజును గుర్తించారు.
బహిరంగ మార్కెట్లో గజం స్థలం రూ.7,150 ఉండగా.. కేవలం రూ. 75 లకే గజం చొప్పున మేనేజింగ్ కమిటీ, జనరల్‌బాడీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే అమ్మేశారని తేలింది. వాస్తవానికి సదరు స్థలం విలువ రూ.34.32 లక్షలుగా నిర్ధారించారు. ఈ మొత్తం స్వాహాకు బాధ్యులుగా ఎం వెంకట్‌రాజు, డీవీవీఎస్ స్వామీజీలను గుర్తించి.. వారి నుంచి రికవరీ చేయాలని నివేదికలో సూచించారు.
* ప్లాట్ నం.84లోని 642 గజాల స్థలాన్ని కూడా గజానికి రూ.75 చొప్పున జీ ప ద్మారావు, వెంకట్‌రాజు 29.6.2011న సభ్యుడు కాని బీ జగదీశ్‌కు అమ్మేశారు. 2013 ఏప్రిల్‌లో ఆయన సభ్యత్వం తీసుకున్నాడు. వాస్తవానికి అప్పటి మార్కెట్ ధర గజానికి రూ.10 వేల వరకు ఉంది. ఈ లెక్కన రూ.64.20 లక్షల మొత్తానికి లెక్కా పత్రం ఏమీ లేదు. దీనికి బాధ్యులైన వెంకట్‌రాజు, డీవీవీఎస్ స్వామీజీ నుంచి రికవరీ చేయాలని నివేదికలో సూచించారు.
* వీటితోపాటు ప్లాట్ నం.45లోని 540 గజాలు, ప్లాట్ నం.75లోని 639 గజాల స్థలాన్ని గజానికి రూ.75 చొప్పున అమ్మేశారు. ఈ రెండు ప్లాట్ల విషయంలో రావాల్సిన రూ.84.29 లక్షల మొత్తాన్ని రికవరీ చేయాల్సిందిగా ప్రాథమిక విచారణ నివేదికలో తేల్చారు.
* సొసైటీలోని పెద్దలు అసలు లేని ప్లాట్లను కూడా సృష్టించి అమ్మేశారు. వాస్తవానికి అనుమతి తీసుకున్న లేఔట్ ప్రకారం బై నంబర్లతో ఎలాంటి ప్లాట్లు లేవు. కానీ 2013 మార్చిలో జనరల్‌బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకుని.. పైప్‌లైన్ రోడ్డు నిర్మాణం వల్ల ప్రభావితం అయిన ప్లాట్ల వారికి బాలాజీ నగర్ లేఔట్‌లోని సర్వే నం.1092/ఏ, 1092/సీలోని ఒక మూలకు మిలిగిన స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించారు.
అందుకు అనుగుణంగా బైనంబర్ ప్లాట్లు 12/1, 12/2, 12/3, 12/4, 12/5, 14/1, 14/2, 16/1, 16/2, 58/1, 74/1, 74/2, 74/3లను సృష్టించారు. వాస్తవానికి బలాజీనగర్ లేఔట్‌లో బైనంబర్లతో ఎలాంటి ప్లాట్లు లేవు. అలాగే పైప్‌లైన్ రోడ్డు నిర్మాణంలో ఎవరు నిజంగా ప్రభావితమయ్యారు? ఎందరు లబ్ధిదారులు? ఎవరు అర్హులు అనే జాబితాను సొసైటీ మేనేజ్‌మెంట్ తయారు చేయలేదు.
దీనితో గజానికి రూ.100 చొప్పున 74/1 ప్లాట్‌లోని 268 గజాలను, 16/1 ప్లాట్‌లోని 419 గజాలను, 14/1 ప్లాట్‌లోని 366 గజాలను, 74/3లోని 65.25 గజాలను, 74/2లోని 194 గజాలను, 12/1 లోని 79.16 గజాలను 2014లో అమ్మేశారు. వాటి వాస్తవ మార్కెట్ ధర గజం రూ. 15 వేల వరకు ఉంది. ఈ అవకతవకల్లో రూ.కోట్లు స్వాహా అయినట్టుగా ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. దీనికి బాధ్యులైన సొసైటీ సెక్రెటరీ ఎం వెంకట్‌రాజు, ఎంసీ మెంబర్ డీవీవీఎస్ స్వామీజీ నుంచి రికవరీ చేయాలని తాకీదుల్లో పేర్కొన్నారు.
* ఫేజ్ సర్వే నంబర్లు 180, 197, 200లో అప్రూవ్డ్ లేఔట్‌ను మార్చివేసి.. ప్లాట్ నం.359లోని 106.74 గజాల స్థలాన్ని 2013లో అమ్మేశారు. అలాగే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కోసం వదిలేసిన ప్లాట్ నం.77/సీ/2 లోని 123 గజాల స్థలాన్ని సొసైటీలో సభ్యత్వం లేని నీతూ అగర్వాల్‌కు గజానికి రూ.100 చొప్పున అమ్మేశారు.
దీనితోపాటు 77/సీ/1 ప్లాట్‌లోని మరో 123 గజాల స్థలాన్ని కూడా రూ.100లకే అమ్మేశారు. ఒక్కో ప్లాట్‌కు వచ్చిన రూ.12,300 లకు కూడా లెక్కలు లేకపోవడం గమనార్హం. చట్ట విరుద్ధంగా చేసిన ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని సహకార శాఖ తన విచారణఱ నివేదికలో ప్రభుత్వానికి సూచించింది.
ఫ్లాట్లు కూడా..
ప్లాట్లే కాదు.. నిర్మించిన భవనాల్లోని ఫ్లాట్లను కూడా అమ్మేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. ఫ్లాట్ నం.401ని రావూరి సాయి కిశోర్‌కు (ఈయన తండ్రి రావూరి సైదేశ్వర్‌రావు సొసైటీకి నూతన అధ్యక్షుడిగా ఉన్నారు) సెప్టెంబర్ 2021లో అమ్మేశారు. వాస్తవానికి కొనుగోలు చేసిన వ్యక్తి సొసైటీలో సభ్యుడు కాదు. ఫ్లాట్ అమ్మగా వచ్చిన రూ.33.60 లక్షల మొత్తానికి లెక్కలు లేవు.
అలాగే ఫ్లాట్ నం.402ను సొసైటీ సభ్యుడుకాని వ్యక్తి భద్రవాడ శ్రీధర్‌కు రూ.33.60 లక్షలకు అమ్మేశారు. ఈ రెండు ఫ్లాట్ల అమ్మకాలకు సంబంధించి మేనేజింగ్ కమిటీగాని, జనరల్‌బాడీగాని ఎలాంటి తీర్మానం చేయలేదు. దీనితోపాటు ఫ్లాట్ నం.501ను కూడా భాగ్యనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు 2023 మేలో రిజిస్ట్రేషన్ చేశారు.
వాస్తవ ధర రూ.42 లక్షల వరకు ఉండగా.. కేవలం రూ. 10.58 లక్షలకే అమ్మేశారు. ఆ మొత్తానికి కూడా లెక్కలు లేవు. ఈ మొత్తం ఫ్లాట్ల తతంగంలో బాధ్యులుగా గుర్తించిన ఆర్ సైదేశ్వర్, ఎం వెంకటరాజు, కే త్రిపుర సుందరి, ఎస్ రామారావు, డీవీవీఎస్ స్వామీజీల నుంచి రికవరీ చేయాలని సిఫారసు చేశారు.
* ఫేజ్-లో అనుమతి పొందిన లేఔట్‌ను మార్చివేసిన సొసైటీ మేనేజ్‌మెంట్.. కొత్తగా 177/1 అనే ప్లాట్‌ను సృష్టించినట్టు విచారణలో తేలింది. వాస్తవానికి సెప్టిక్ ట్యాంక్ కోసం నిర్ణయించిన స్థలంపై అక్రమంగా 177/1 అనే ప్లాట్ నంబర్‌ను సృష్టించారు. ఈ ప్లాట్‌ను గజానికి రూ.100 చొప్పున 2014లో అమ్మేశారు. అప్పుడు అక్కడ రూ.15000లకు గజం మార్కెట్ రేటు ఉంది.
ఈ ప్లాట్‌ను కొనుగోలు చేసిన డీవీవీఎస్ స్వామీజీ అనే వ్యక్తి అప్పట్లో సొసైటీ ఎంసీ మెంబర్ కావడం గమనార్హం. దీనికి అప్పటి సొసైటీ కార్యదర్శి ఎం వెంకట్‌రాజు సహకరించారని ప్రాథమిక విచారణలో తేల్చారు. దీనిపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అధికారులు విచారణ చేసి క్రిమినల్ కేసు నమో దు చేయాలని, ప్లాట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని సహకార శాఖ రిపోర్టు ఇచ్చింది.
కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ప్లాట్‌ను అమ్మడం ద్వారా రావాల్సిన రూ.17,15,550 మొత్తానికి కూడా ఎక్కడా లెక్కలు లేవు. ఈ మొత్తాన్ని ఎం వెంకటరాజు, డీవీవీఎస్ స్వామీజీ నుంచి రికవరీ చేయాలని నివేదికలో సూచించారు.