సుంకవల్లి సత్తిరాజు :
నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
అక్షరం లక్ష్యసాధనకు సోపానం. అది జ్ఞాన సముపార్జనకు మొద టి అడుగు. మనిషిగా జన్మించిన ప్రతీ ఒక్కరికీ అక్షర జ్ఞానం అత్యంతావశ్యకం. అనం తమైన జ్ఞానం అక్షరంతోనే ప్రారంభమవుతుంది. అక్షరాలు దిద్దకుండా జీవితాలను సరిదిద్దుకోవడం సాధ్యం కాదు. అజ్ఞాన గాఢాంధకారాన్ని పారద్రోలి, విజ్ఞానమనే వెలుగులో పయనించాలంటే, మారుతు న్న ప్రపంచ పోకడలను గమనించి, తమను తాము కాపాడుకోవాలంటే ప్రతీ ఒక్కరూ అక్షరాయుధంతో సంసిద్ఢం కావా లి. చదువుల తల్లి ఒడిలో అక్షరాల గోరుముద్దలను తిని, సంస్కారంతో, మానసిక వికాసంతో, పెరిగి పెద్దవారై పరిపూర్ణమైన వ్యక్తిత్వ నిర్మాణంతో దేశానికి, ప్రపంచానికి వెలుగురేఖ కావాలి.
మనిషిలో నిగూఢమై న శక్తియుక్తులను వెలికితీసి, తద్వారా సమాజానికి ఉపకరించేలా వ్యక్తిని తీర్చిదిద్దడమే విద్య ప్రధాన ధ్యేయం. ‘విద్య నెఱుంగని వాడు మర్త్యుడే..’ అనే భర్తృ హరి సుభాషితం చదువు గొప్పదనాన్ని చాటి చెబుతున్నది. విద్య లేకపోతే మనిషిగా మనలేమనే భావాన్ని స్ఫురింపచేస్తు న్నది. అక్షరానికి ఉన్న ప్రాధాన్యతను విస్మరించకూడదు. అక్షరాస్యత వల్ల ఒనగూడే ప్రయోజనాలను అందరూ గ్రహించాలి. గతానికి, వర్తమానానికి అక్షరాస్యతా శాతం లో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. కేవలం అక్షరాలు నేర్చుకుని, సంతకం చేసినంత మాత్రాన ఫలితం శూన్యం. ప్రతీ ఒక్కరూ కనీస విద్యను అభ్యసించి, జ్ఞానాన్ని సముపార్జించాలి. జ్ఞానం ద్వారా దేశానికి, ప్రపం చానికి ఉపకరించాలి.
విద్యను కేవలం స్వప్రయోజనాల కోసం వినియోగించడం, సమాజ హితాన్ని గాలికి వదిలేయడం వల్ల లోక ప్రయోజనం శూన్యం. అక్షరాస్యత పెరిగిందని సంతసించడం తగదు. పెరిగిన అక్షరాస్యత వల్ల సమాజానికి ఏమైనా మేలు జరిగిందా? అనే కోణంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అక్షరాస్యతకు సరై న నిర్వచనంగా జీవించాలి. అక్షరాలను దిద్ది, సక్రమమైన విద్యను అభ్యసించి, పెద్దలపట్ల, దేశం పట్ల గౌరవభావాన్ని ప్రదర్శి స్తూ, ఉత్తమ పౌరులుగా రూపొందాలి. సర్వకాల సర్వావస్థలలోనూ మనం నేర్చిన విద్య సమాజానికి అన్ని విధాలుగా తోడ్పడేలా ఉండాలి.
చదవేస్తే ఉన్న మతి పోతుందా?
నేటి సమాజంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయి. నేరాల సంఖ్య పెరుగుతున్నది. ఇలాంటి అవాంఛనీయ పరిణా మాలపై అక్షరం అంకుశంలా మారాలి. చదువులవల్ల మనుషుల్లో జ్ఞానం, సంస్కా రం పెరగాలి. వినయ విధేయతలతో వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. కానీ, నేటి సమాజంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. జ్ఞానాన్ని ప్రసాదించవలసిన విద్యలు స్వార్థానికి సోపానాలుగా మారుతున్నాయి. ధనార్జన కోసమే లౌకిక విద్య లు ఉపకరిస్తున్నాయి. విలువలతో జీవించే పరిస్థితులను నేటి విద్యలు నేర్పించడం లేదు.
అక్షరాస్యత పెరిగింది. విద్యావంతుల శాతం పెరిగింది. అయినా నేటి వ్యవస్థలో మోసాలు పెరిగిపోతున్నాయి. నేర ప్రవృత్తికి అలవాటు పడి, అసాంఘిక శక్తులుగా మారకుండా యువతను నేటి చదువులు కట్టడి చేయడం లేదు. యువత దుర్వ్యసనాలతో నిర్వీర్యమవుతున్నది. హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యంలా మారిపోయాయి. దీనినిబట్టి విశ్లేషిస్తే చదువుల విలువ, పెరిగిన అక్షరాస్యత శాతం వల్ల ఒరిగేదేమీ లేదనే సత్యం బోధపడుతున్నది. చిన్నప్పుడు కాకరకాయ, పెద్దయ్యాక కీకరకాయలా, ‘చదవేస్తే ఉన్న మతి పోయి న చందం’గా నేటి చదువులు తయారయ్యాయి. ఈ నేపథ్యంలో అక్షరాస్యత ప్రాథమిక లక్ష్యాన్ని గుర్తించాలి.
ఒకప్పుడు చదువును మూడో నేత్రంగా పవిత్రంగా భావించేవారు. సక్రమమైన పద్ధతిలో జీవించడానికే చదువు అనే మాట వినిపించేది. కాలంతోపాటు అక్షరం వినియోగం అనేక విధాలుగా రూపాంత రం చెందింది. అక్షరం సంస్కారానికి ప్రతిరూపంగా ఆనాడు భావించేవారు. అయి తే, వర్తమానంలో అక్షరం, లౌకిక చదువుల ద్వారా లభించే జ్ఞానం స్వీయ ప్రయోజనాల కోసమే ఎక్కువగా వినియోగిస్తుండ డం వల్ల చదువుల లక్ష్యం మారిపోయింది. షోడశ సంస్కారాల్లో అక్షరారంభం లేదా విద్యారంభం కూడా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం.
విద్యకున్న విశిష్టత ఏమి టో పురాణ కాలంలోనే విశదీకరించబడిం ది. చదువు అంటే సంస్కరించేది. సంస్కార రహితమైన చదువులు సమాజానికి మేలు చేయవు. చదువులు బతుకు తెరువు కోస మే కాదు. మనిషిలోని మనసును ప్రేరేపిం చి, మంచిని పెంచే మహత్తరమైన సాధనం విద్య. కానీ, నేటి విద్య నేతి బీరకాయ చందంగా తయారైంది. అక్షరాస్యత పెరిగింది. అక్షరజ్ఞానం పెరిగింది. సంస్కారం కొరవడింది. చదువుకుని సర్వసద్గుణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అక్షరం అర్థం, చదువుల పరమా ర్థం మారిపోయింది.
జ్ఞానం కంటే సంపాదనే సమాజంలో ప్రముఖ పాత్ర వహిస్తు న్నది. చదువు కేవలం సంపాదన కోసమే అన్న అభిప్రాయాలు తీవ్రరూపం దాల్చా యి. ఈ నేపథ్యంలో మన విద్యావ్యవస్థను సంస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అక్షరం విలువను పెంచాలి. అనవసర అజ్ఞానాన్ని పారద్రోలాలి. పెద్దలను గౌరవించే పద్ధతులు నేర్పని చదువుల వల్ల సంస్కారం శూన్యం. అక్షరాస్యత అరకొరగా ఉన్న రోజుల్లోనే సమాజంలో చక్కని విలువలు ఉండేవి. అక్షరాస్యత పెరిగే కొద్దీ అజ్ఞానమూ అదే స్థాయిలో పెరగడం, చదువంటే కేవలం మన దర్పాన్ని పెంచే సాధనంగా మారడం దౌర్భాగ్యం. మనో వికాసానికి కాకుండా, మానసిక దౌర్బల్యానికి దారితీసే విధంగా విద్యావంతులు పయనించడం దురదృష్టకరం.
అక్షరాసత్యను సార్థకం చేద్దాం
చదువులవల్ల మానసిక పరివర్తన రావాలి. అది మన జీవన శైలిలో సక్రమమైన మార్పు తేవాలి. అక్షరాస్యతతో సమాజాన్ని సంస్కరించాలి. ఎన్నో దేశాలు అక్షరాస్యతా శాతాన్ని పెంచడానికి విశేష కృషి చేస్తున్నాయి. ఫిన్లాండ్, నార్వే, లక్సంబర్గ్, ఉక్రెయిన్, తజికిస్తాన్, బెలారస్, ఉక్రె యిన్ తదితర దేశాలు ప్రపంచంలో నూటి కి నూరు శాతం అక్షరాస్యత సాధించి, అగ్రస్థానంలో ఉన్నాయి. చాద్ అనే దేశం ప్రపంచంలో అత్యల్ప అక్షరాస్యత కలిగిన దేశంగా మారింది. మాలి, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు అక్షరాస్యతలో వెనకబడ్డాయి. భారతదేశంలో అక్షరాస్యత సుమారు 72 శాతంగా ఉంది.
దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లో కేరళ 93.9 శాతంతో అగ్రస్థానంలో ఉంది. లక్షద్వీప్, మిజోరం, త్రిపుర, గోవా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా 99 శాతం అక్షరాస్యతను కలిగి ఉంది. చైనాలోకూడా అక్షరాస్యత శాతం రమారమి 99 శాతానికి పెరిగినట్టు కొన్ని అంచనాలు తెలుపుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో అక్ష రాస్యతా శాతం అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. కొన్ని దేశాలు మత ఛాందస వాదంతో బాలికలను అక్షరాస్యతకు దూరం చేస్తున్నాయి.
సాంకేతిక పరి జ్ఞానంతో ప్రపంచం ముందుకు దూసుకు పోతుంటే, ఇంకా కొన్ని దేశాల్లో కనీస విద్య లభించడం లేదు. సరైన పాఠశాలలు లేవు. వాటిలో కనీస మౌలిక సదుపాయా లు ఉండవు. అంతరిక్షాన్ని శాసిస్తున్న వర్తమాన ప్రపంచంలో ఇంకా పలు దేశాలు కనీస అక్షరజ్ఞానం లేకుండా అజ్ఞానంలో మగ్గి పోవడం శోచనీయం. అక్షరాస్యత ఆవశ్యకతను ప్రపంచమంతా గుర్తించాలి. అర్థవంతమైన విద్యలతో ప్రపంచానికి దశాదిశా నిర్దేశం చేసే యువత తయారు కావాలి. అక్షరం సమస్త జగతి గతిని శాసిం చే ఇంధనమని గుర్తిస్తేనే సమాజానికి నిజమైన మేలు.
వ్యాసకర్త సెల్: 9704903463
అక్షరాస్యతకు అరకొర నిధులే
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో విద్యకు కేటాయింపులు చాలా తక్కువనే చెప్పాలి. అక్షరాస్యత పెంపు మందగమనంలో కొనసాగడానికి నిధుల కొరత ప్రధాన కారణం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2.91 లక్షల కోట్లు కాగా, దీనిలో విద్యకు రూ.21,292 కోట్లు మాత్రమే కేటాయించారు. మహారాష్ట్రలో రూ. 80, 437 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో రూ. 75, 165 కోట్లు, రాజస్థాన్‌లో రూ. 49, 627 కోట్లు, తమిళనాడులో రూ. 43, 799 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో రూ. 43,466 కోట్లు కేటాయించడం గమనార్హం. జాతీయ గణాంక కార్యాల యం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన 2023 సంవత్సరం లెక్కల ప్రకారం పై రాష్ట్రాలు వరుసగా 84.8, 73, 69, 82.9, 80.5 శాతం అక్షరాస్యత రేట్లు సాధించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రస్తు త అక్షరాస్యత రేటు 72.8 శాతం మాత్రమే.
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రూ.1,100 కోట్లతో రాష్ట్రంలోని 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేపట్టింది. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సౌకర్యాలు, నూతనంగా రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు, రూ. 5 వేల కోట్ల తో 30 కాంప్లెక్స్‌ల్లో 120 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యంగ్ ఇండి యా పేరుతో) భవనాల నిర్మాణం, ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కృషి, 57 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ప్రభు త్వం. రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత 57.30 శాతం కాగా, పట్టణ అక్షరాస్యత 81.09 శాతంగా ఉంది. భారత దేశం సామాజిక, ఆర్థిక పురోగతికి అక్షరాస్యత కీలకంగా మారింది.
స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలం టే 80 శాతం అక్షరాస్యత ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యత సాధనలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. అందరికీ విద్య చేరువ కావాలంటే ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలి. బాలి కా విద్యను ప్రోత్సహించాలి. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వర కు సృజన శక్తికి పెద్దపీట వేయాలి. సాంకేతికత అందిపుచ్చుకుని ఉపాధ్యాయులకు శిక్షణ అందించాలి. ఉపాధి ఆధారిత ఉన్నత విద్యా కోర్సులను తీసుకురావాలి. అప్పుడే దేశం విజ్ఞాన భాండాగారంగా వెలుగొందే అవకాశం ఉంటుంది. ఈ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్యారంగంలోని సవాళ్లు, సమస్యల పరిష్కా రానికి అందరం కలిసి కట్టుగా కృషి చేయాల్సి ఉంది.
డా. షేక్ జాన్ పాషా