calender_icon.png 13 February, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటాపై తలో మాట

13-02-2025 12:55:37 AM

  1. ఒకే నామినేషన్ వస్తే ఏకగ్రీవమే:  కాంగ్రెస్ 
  2. ఒక నామినేషన్ వచ్చినా.. నోటా ఉండాలి : బీఆర్‌ఎస్
  3. సుప్రీంలోని అంశం: బీజేపీ 

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : రానున్న పంచాయతీ ఎన్నిక ల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలకు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన వారు రెండోసారి ఎన్నికల్లో పోటీ చేకుండా నిబంధన తీసుకురావాలని భావిస్తోంది, ఒకే నామినేషన్ వేస్తే ఏకగ్రీవ ఎన్నిక ప్రకటించకుండా నోటాను అభ్యర్థిగా పరిగణించి ఓటింగ్ పెట్టాలని యోచిస్తోంది.

ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధ్యక్షతన మంగళ వారం  వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది.  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి పాదనలపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది.

మళ్లీ ఎన్నికలు నిర్వహించడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమని పేర్కొన్నది. ఒకే నామినేషన్ వచ్చిన చోట ఏకగ్రీవంగా ఎన్నిక ప్రకటించకుండా నోటాను అభ్యర్థిగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించాలన్న ప్రతిపాదనను బీఆర్‌ఎస్ సమర్థించింది. ఏకగ్రీవ ఎన్నికల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అభిప్రాయం చెప్పలేమని బీజేపీ వెల్లడించింది.

ఎన్నికల్లో నోటాకు సంబంధించిన నిర్ణయాలు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని, దానికి అవసరమైన చట్టసవరణలు చేయాల్సి ఉంటుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. నోటా ఉండాలని, కానీ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక  నిర్వహించడం సరికాదని సీపీఎం పార్టీ అభిప్రాయపడింది.

ఒకే అభ్యర్థి ఉన్న గ్రామా ల్లోనూ నోటా పెట్టి పోలింగ్ నిర్వహించాలని జనసేన పార్టీ సూచించింది.  ఇక రెండు రోజుల్లో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని టీడీపీ తెలిపింది. రాజకీయ పార్టీల నేతల సూచనలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. న్యాయ నిపుణుల సూచనలు కూడా స్వీకరించనుంది.

ఇదిలా ఉండగా, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ  నచ్చలేదన్న అభిప్రాయాన్ని తెలిపే స్వేచ్చ ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో  నోటాను ప్రవేశపెడుతూ 2016, 2018, 2019లో రాష్ట్రంలో నిబంధనలు సవరించారు. అయితే ఒకవేళ నోటాకే ఎక్కువ  ఓట్లు వచ్చినప్పటికి ఆ తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తి ఎన్నికైనట్లు ప్రకటించాలని ప్రస్తుతం నిబంధన ఉన్నది.

ఒకే నామినేషన్ వచ్చినట్లయితే ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నారు. అయితే  ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కొన్ని చోట్ల బలప్రయోగాలు, జరుగుతున్నాయని నోటాతో ఎన్నికలు పెట్టాలని పలు ఎన్జీవోలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి.  ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలపై అధ్యయనం చేసిన ఈసీ మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా విధానాలను పరిశీలించింది. 

ఈ రాష్ట్రాల్లో.. పోటీలో ఉన్న అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన అమల్లో ఉంది. రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం మళ్లీ ఎన్నిక నిర్వహింకుండా రెండో స్థానం ఉన్న అభ్యర్థిని ఎన్నికైనట్లు ప్రకటించేలా నిబంధనలున్నాయి.

హర్యానాలో మాత్రం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించండంతో పాటు మొదటిసారి పోటీలో ఉన్నవారు తిరిగి పోటీ చేయరాదనే రూల్ ఉంది. సమావేశానికి కాంగ్రెస్ నాయకులు కమలాకర్‌రావు, రాజేశ్‌కుమార్, బీజేపీ నాయకులు ఎస్ మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు సోమ భరత్‌కుమార్, పల్లె రవికుమార్ పాల్గొన్నారు.