14 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి వారసులకు నకిలీ పట్టా
నాగర్‌కర్నూల్, ఆగస్టు 12 (విజయక్రాంతి): 14 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తికి సంబంధించిన వారసులకు నకిలీ పట్టా చేశారని గుర్తించి న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా స్పందించకపోవడాన్ని నిరసిస్తూ మహిళా రైతు కలెక్టర్ ముందే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. బిజినేపల్లి మండలం లట్టుపల్లికి చెందిన బాలయ్య 14 ఏళ్ల కిత్రం మరణించాడు. తనకున్న 27 ఎకరాల్లో ప్రభుత్వం 2 ఎకరాలను కేఎల్‌ఐ కాల్వకు సేకరించగా మిగిలిన 25 ఎకరాలు బాలయ్య వారసులైన శ్రీశైలం, వెంకటయ్య, బాలయ్య, పార్వతమ్మ, నాగయ్యలు వారసులుగా ఉన్నారు.
కాగా.. బిజినేపల్లి తహసీల్దార్ శ్రీరాములు అత్యుత్సాహంతో 14 ఏళ్ల కిత్రం మరణించిన పట్టాదారు పేరుతో ఉన్న మూడో వాటాదారు బాలయ్య వారసులకు ఐదు నెలల క్రితం అప్పనంగా 25 ఎకరాలను అక్రమంగా రిజిస్టేషన్ చేశారు. 14 ఏళ్ల కిత్రం మరణించిన బాలయ్య ౫నెలల క్రితం తిరిగి బతికొచ్చినట్టు తన వారసత్వం కింద నరేష్, రాములు, మల్లేష్, యాద మ్మ, విజయలక్ష్మిపేర రిజిస్టేషన్ చేశాడు. విషయం నిజమైన వారసులకు తెలియడంతో తహసీల్దార్‌ను నిలదీశారు. దీంతో తప్పు సరిచేస్తానంటూ కాలం వెల్లదీశాడు.
భూమి వీరి పేరిమీదికి మార్చేందుకు రూ.70 వేలు లంచం తీసుకున్నాడని బాధితులు ఆరోపించారు. అయినా పని చేయకపోవడంతో గత మంగళవారం బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు.విషయం తెలుసుకున్న ఆర్డీవో సురేష్, ఎస్సై నాగశేఖర్‌రెడ్డి బాధితులకు నచ్చజెప్పి పంపారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ సంతోష్ ముందే పురుగు మందుతో వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సిబ్బంది గమనించి వారి నుంచి పురుగుమందు డబ్బాను లాక్కుని వారి సమస్యను విని వెంటనే అక్కడికక్కడే పరిష్కరించారు.