మద్యం మత్తులో అతివేగంతో ప్రయాణం
అదుపుతప్పి ఫల్టీ కొడుతూ మహిళను ఢీకొన్న కారు...
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంతో ప్రయాణిస్తూ అదుపుతప్పి ఫల్టీ కొడుతూనే నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా పెద్దముద్దునూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం... పెద్దముద్దునూర్ గ్రామానికి చెందిన భోగరాజు లక్ష్మమ్మ (45) బుధవారం తెల్లవారుజామున అటుగా నడుచుకుంటూ వెళ్తుండగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం నుండి కొల్లాపూర్ వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు అత్యంత వేగంతో అదుపుతప్పి పల్టీలు కొడుతూ నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టింది ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా రోడ్డు పక్కనే ఉన్న ఇంటి ముందు రంగవల్లులు ముగ్గులు వేస్తున్న మహిళలపైకి దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా కంగారు పడుతూ పరుగులు పెట్టారు. అక్కడే ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆధారంగా ఆర్మీలో డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి మద్యం మత్తులో కారును అతివేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు.