- తన భూమిని ఇతరులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని ఆరోపణ
- జనగామ తహసీల్దార్ కార్యాలయంలో ఘటన
జనగామ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): తమ భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయంలో పురుగు మందు డబ్బా పట్టుకుని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయకపోతే చనిపోతానంటూ బెదిరించింది. అక్కడున్న వారు పురుగు మందు డబ్బా లాక్కుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి వివరాల ప్రకారం.. జనగామ మండలం గానుగుపహాడ్‌కు చెందిన తేజావత్ యశోదా కుటుంబానికి గ్రామంలో 14 ఎకరాల భూమి ఉంది.
ఇందులో వారసత్వంగా తనకు మూడెకరాలు రావాల్సి ఉందని, కానీ ఆ భూమిని తమ పాలి వారు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు రావాల్సిన భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని వాపోయారు. తనకు రావాల్సిన భూమిని కాపాడాలంటూ ఆమె గురువారం జనగామ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తన భూమి పోతే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ పురుగుల మందు డబ్బాతో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని న్యాయం చేస్తామని నచ్చజెప్పి శాంతింపజేశారు.