calender_icon.png 18 November, 2024 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిగ్విజయంగా సెమీస్‌కు

18-11-2024 12:48:55 AM

  1. జపాన్‌పై భారత్ విజయం 
  2. మెరిసిన దీపిక, నవ్‌నీత్ కౌర్ 
  3. ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ

వాడెవడన్నా.. వీడెవడన్నా.. అన్న చందంగా భారత మహిళల హాకీ జట్టు దూసుకుపోతోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో శనివారం చైనాకు చెక్ పెట్టిన సలీమా సేన ఆదివారం జపాన్‌కు జాతర చూపించింది. ఐదు వరుస విజయాలతో ఓటమి ఎరుగని మన అమ్మాయిలు గ్రూప్ దశను తొలి స్థానంతో ముగించి దిగ్విజయంగా సెమీస్‌లో అడుగుపెట్టారు. 

రాజ్ గిర్ (బిహార్): మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుస విజయాలతో దిగ్విజయంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో భారత్ 3-0తో జపాన్‌ను మట్టికరిపించింది. భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (37వ నిమిషం), దీపిక (47, 48వ నిమిషం) గోల్స్ సాధించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

మొదటి నుంచి దూకుడుగా ఆడిన సలీమా సేన జపాన్ అమ్మాయిలకు అసలు గోల్ చేసే అవకాశమే ఇవ్వలేదు. ఈ టోర్నీలో అత్యంత దూకుడైన ఆటతీరుతో టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన దీపిక ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటింది.

వరుసగా రెండు గోల్స్ కొట్టి జపాన్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ విజయంతో భారత్ ఓటమనదే లేకుండా 15 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలవగా.. ఒక ఓటమితో చైనా రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా మంగళవారం జరగనున్న సెమీస్‌లో జపాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

ఆరంభం నెమ్మదిగా..

ఈ మ్యాచ్‌లో భారత్ తన మ్యాచ్‌ను నెమ్మదిగా మొదలు పెట్టింది.  తొలి హాఫ్ ఎటువంటి గోల్ లేకుండానే ముగిసింది. భారత్ గోల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసి నా కానీ జపాన్ డిఫెండర్లు గోల్ ఇవ్వకుం డా అడ్డుకున్నారు. ఇక సెకండాఫ్ మొదలైన కొద్ది సేపటికే భారత ప్లేయర్లు గోల్ సాధించారు. భారత ఫార్వార్డర్ నవనీత్ అద్భుత రీతిలో బ్యాక్ హ్యాండ్ గోల్ సాధించింది. దీంతో భారత్‌కు 1-0 ఆధిక్యం లభించింది.

గోల్స్‌తో టోర్నీలో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న భారత ఫార్వార్డర్ దీపిక ఈ మ్యాచ్‌లో కూడా సత్తాచాటింది. నాలుగో క్వార్టర్‌లో 47, 48 నిమిషాల్లో గోల్స్ చేసి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టింది. మిగిలిన మ్యాచ్‌ల్లో మలేషియా 2 థాయ్‌లాండ్‌పై, చైనా 2-0తో దక్షిణ కొరియాను చిత్తు చేశాయి.