calender_icon.png 22 December, 2024 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్కు చెదరని ఉక్కు సంకల్పం

15-10-2024 12:00:00 AM

పీడిత, వంచిత వర్గాల పక్షాన సంధించే పదునైన ప్రశ్న ఏ రూపంలో ఉన్నా నియంతృత్వ స్వభావం కలిగిన రాజ్యం తొలుత బంధిస్తుంది, తర్వాత పరోక్షంగా బలి తీసుకుంటుందని మరోమారు రుజువైంది. 90 శాతం అంగవైక ల్యం బాధిస్తున్నా.. అక్రమ నిర్బంధాలు వేధిస్తున్నా.. చివరి శ్వాస వరకు నోరులేని ప్రజల గొంతుకగా నిలిచారు ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబా.

ఆయన అపార జ్ఞాన సంపదను చూసి.. కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరిచే పాలకులు భయపడ్డారు. అందుకే నడవలేకుండా చక్రాల కుర్చీకే పరిమితమై.. ఢిల్లీ వర్సిటీలో విద్యార్థులకు పాఠాలు చెప్పే ఆచార్యుడిని అర్బన్ నక్సలైట్ గా చిత్రీకరించి నాగ్ పూర్ సెంట్రల్ జైలు ‘అండా సెల్ ’లో చిత్ర హింసలు పెట్టారు.

ఏ తప్పు చేయకుండానే 3,588 రోజుల పాటు నిర్బంధంలో దుర్భర జీవితం అనుభవించేలా చేశారు. ఆఖరికి రెండవ సారి  ‘న్యాయం ’ గెలిచి ఆయన నిర్దోషిగా విడుదలైనా రాజ్యం చేసిన గాయాలు వదలకుండా వెంటాడాయి. ఫలితంగా హక్కుల గొంతుక మూగబోయింది.’ 

‘పురాణాల్లో సీతాదేవి ఒక్కసారే అగ్ని పరీక్ష ఎదుర్కొం ది. నేను మాత్రం రెండు సార్లు అగ్ని పరీక్షను ఎదుర్కొన్నాను’ అంటూ కఠిన కారాగారం నుండి విముక్తి పొంది న తర్వాత సాయిబాబా చెప్పిన మాటలు వింటే  కళ్లు చెమ్మగిల్లుతాయి. 

గోకరకొండ నాగ (జిఎన్)  సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. బాల్యంలోనే పోలియో వ్యాధి బారిన పడటంతో అనేక కష్టాల మధ్య ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ సమయంలోనే సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు.

వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యారు. హైదరాబాద్  సెంట్రల్ యూనివర్సిటీ, ఇంగ్లీ ష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీ వర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా బాధ్యతలు చేపట్టారు. నడవలేని ఆయన ఎన్నడూ తరగతి గదికి ఆలస్యంగా వెళ్లలేదంటే.. అది ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.    

ఒక వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే మరో వైపు ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, రైతాంగం, కార్మికులు, విద్యార్థుల న్యాయమైన పోరాటాలకు అండగా నిలిచారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం మనసారా పరితపించారు.

అందుకే మనువాద భావ జాలం కలిగిన రాజ్యం ఆయనను రాజ్యద్రోహిగా చిత్రీకరించేందుకు చివరివరకు ప్రయత్నించి విఫలమైంది. సాయిబాబా మానవ హక్కుల పరిరక్షణకై పిడికిలెత్తి నినదించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి స్వయంగా మద్దతును ప్రకటించి న్యాయం వైపున కూర్చున్నారు. 

అందరిలాగే ఉద్యోగం చేసుకుంటే సాయిబాబా జీవితం హాయిగా సాగిపోయేది, కానీ ఆయన సమాన త్వం అడిగారు. అందుకే ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. దేశంలోని మధ్య, ఈశాన్య ప్రాంతాల్లోని ఆదివాసుల హక్కుల కోసం సాయిబాబా పోరాటం చేయించారు. ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’కు వ్యతిరేకంగా గొంతెత్తారు. ఆదివా సులకు హక్కుల పాఠాలు విప్పి చెప్పారు.

అందుకే, సమానత్వం ఒప్పుకోని రాజ్యం కుట్రలను నమ్ముకుంది. ఈ నేపథ్యంలోనే సాయిబాబాకు నిషేధిత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, ఆయనదేశంపై యుద్ధం చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2014లో అరెస్టు చేయించారు. 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్ కోర్టు దోషులు గా నిర్ధారించారు.

దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబర్ 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించడంతో.. హైకోర్టు తీర్పునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పును పునర్విచారణ చేపట్టాలని బాం బే హైకోర్టును ఆదేశించింది.

ఈ నేపథ్యంలో జస్టిస్ జోషి, జస్టిస్ వాల్మీకిల ధర్మాసనం విచారించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. అంటే, ఈ దేశ చరిత్రలో రెండు సార్లు నిర్దోషిత్వం నిరూపించుకున్న వ్యక్తిగా సాయిబాబా నిలిచిపోయారు. ఇది అమానవీయం కదా ?

2024 మార్చిలో ఆయన జైలు నుండి విడుదలయ్యా రు. అంటే, ప్రజా హక్కుల కోసం ఉద్యమించిన విద్యవేత్తను దాదాపు తొమ్మిదేళ్లు జైలులో ఉంచి శారీరక, మానసిక ఇబ్బందులు గురి చేశారని, జీవించే హక్కును సైతం కాలరాశారని స్పష్టంగా అర్థమవుతుంది. విడుదలైన అనంతరం సాయిబాబా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. అయినా సుందరమైన సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షించే సాయిబాబా అణిచివేతను చిరునవ్వుతో స్వీకరించారు. 

చెక్కు చెదరని సంకల్పంతో సమసమాజ స్థాపన దిశగా చక్రాల కుర్చీతో ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే తీవ్ర అనారోగ్యం బారినపడిన సాయిబాబా తెలుగు నేల పైనే అస్తమించారు. 90 శాతం వైకల్యం ఉన్నా..నూటికి నూరుశాతం మానవ హక్కులు, మట్టి మనుషుల కోసం ఉద్యమించి దివిటీగా నిలిచారు. భౌతికంగా సాయిబాబా దూరమైనా.. ఆయన వదిలిన ప్రశ్న లు అన్యాయంపై తిరుగుబాటు చేస్తూనే ఉంటాయి. 

 నరేష్ పాపట్ల