18-02-2025 04:55:42 PM
పాపన్నపేట: అల్లుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని బాచారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య(45) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనెల 15న పొలం వద్ద కింద పడగా కాలుకు, నడుముకు గాయమైంది. నడవలేని స్థితిలో ఉన్న అతను ఏ పని చేయలేడని ఆస్పత్రికి డబ్బులు ఖర్చు అవుతాయని భావించిన భార్య శివమ్మ, అల్లుడు రమేష్ లతో కలిసి ఆదివారం అర్థరాత్రి సమయంలో టవల్ తో గొంతుకు ఉరి బిగించి ఉరి వేసి హత్య చేశారు. సహజంగా మరణించాడని బంధువులకు నమ్మబలికించారు.
బంధువులు, గ్రామస్థులు ఇంటి వద్దకు వచ్చి అనుమానం వచ్చి ఆశయ్యా గొంతు వద్ద చూడగా కమిలిన గాయం కనిపించింది. అంత్యక్రియలు చేయకుండా అలాగే వారిని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. రాత్రి సమయంలో పొలీసులకు విషయం తెలుపడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరి గంగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.