క్యూ3 ఫలితాలు, ఎఫ్‌పీఐ ట్రేడింగ్‌పై దృష్టి మార్కెట్ కదలికలపై విశ్లేషకుల అంచనాలు
ముంబై, జనవరి 12: కొత్త క్యాలండర్ సంవత్సరం ప్రారంభంలో జరిపిన పెద్ద ర్యాలీ వెనువెంటనే వెనక్కు మళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ కదలికల్ని ఈ వారం కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు నిర్దేశిస్తాయని విశ్లేషకులు తెలిపారు.
అలాగే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) ట్రేడింగ్ యాక్టివిటీపై మార్కెట్ దృష్టి నిలిచి వున్నదన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరపడంతో భారత మార్కెట్‌పై ఒత్తిడి ఏర్పడుతున్నదని, కొత్త ఏడాదిలో వారి వైఖరి ఆధారంగా సమీప భవిష్యత్‌లో ట్రెండ్ ఉంటుందని వివరించారు.
డాలర్ మారకపు రేటు, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు కూడా మార్కెట్ దిశను నిర్దేశించే అంశాలేనని మాస్టర్‌ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా తెలిపారు. అదేపనిగా పడిపోతున్న రూపాయి విలువను కూడా ఇన్వెస్టర్లు ట్రాక్ చేస్తున్నారని, కరెన్సీ కదలికలు కూడా స్టాక్స్ కదలికల్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.
కార్పొరేట్ ఫలితాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, క్రూడ్ ధరల పెరుగుదల గ్లోబల్ ట్రెండ్ తదితరాలు మార్కెట్‌ను తీవ్ర ఒడిదుడుకులకు లోనుచేస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అంచనా వేశారు. జనవరి 10తో ముగిసిన వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,844 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూడగా, నిఫ్టీ 573 పాయింట్లు కోల్పోయింది.
సెన్సెక్స్ 77,378 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,431 పాయింట్ల వద్ద ముగిసాయి. గత శుక్రవారం డాలరు మారకంలో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయి 86.04 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్ల వద్దకు ఎగిసింది. యూఎస్ డాలర్ పటిష్ఠత, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, గరిష్ఠ క్రూడ్ ధరలు గతవారం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని, ఈ వారం కూడా మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుందని విశ్లేషకులు అంచనా వేశారు.
తరలిన రూ.22, 194 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాల జోరు పెంచారు. జనవరి నెలలో ఇప్పటివరకూ రూ.22,194 కోట్ల పెట్టుబడుల్ని ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్నట్లు డిపాజిటరీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ నెల మొత్తంమీద రూ.15,446 కోట్లు నికరంగా ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు తిరిగి జనవరిలో అమ్మకాలకు తెరతీశారు. డిపాజిటరీల డేటా ప్రకారం జనవరి 10 వరకూ ఎఫ్‌పీఐలు రూ.22,194 కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా విక్రయించారు. జనవరి 2 మినహా మిగిలిన అన్ని ట్రేడింగ్ రోజుల్లోనూ వీరి విక్రయాలు కొనసాగాయి.
డాలర్ పటిష్టంగా ఉంటూ యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయమైన రాబడులు ఇస్తున్నంతకాలం ఎఫ్‌పీఐలు భారత్ మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 109 వద్ద, 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ 4.7 శాతం ఎగువన ఉన్నదని తెలిపారు.
రానున్న రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అమలుపర్చే విధానాలు, ద్రవ్యోల్బణం ట్రెండ్, కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల సరళిపై ఆధారపడి ఉంటాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.
ట్రంప్ 2.0 పై దృష్టి
కార్పొరేట్ ఫలితాలు సీజన్ నడుస్తున్న సమయంలోనే ట్రంప్ 2.0 పై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
ఇప్పటికే చైనా, మెక్సికో, కెనడా తదితర దేశాల దిగుమతులుపై టారీఫ్‌లు విధించనున్నట్టు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ 2.0 యంత్రాంగం తీసుకునే విధానపరమైన చర్యలు, ప్రపంచ వాణిజ్యంపై వాటి ప్రభావంపై వివిధ అంచనాలు మార్కెట్లను ఒడిదుడుకులకు లోనుచేయవచ్చని అంచనా వేస్తున్నట్లు గౌర్ వివరించారు.
ద్రవ్యోల్బణం డేటా కీలకం
సోమవారం వెలువడే డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా మార్కెట్‌కు కీలకమైనదని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా తెలిపారు. టోకు ధరల గణాంకాలు మంగళవారం వెలువతాయి. ఈ ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ప్రభావితం చేస్తాయని, సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గిస్తారా? లేదా అన్న అంశమై ఇన్వెస్టర్లలో అంచనాల్ని ఏర్పరుస్తాయని విశ్లేషకులు వివరించారు.
అలాగే ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, తదితర ప్రధాన కంపెనీలు వెల్లడించే ఆర్థిక పనితీరు మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపిస్తుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు. క్యూ3 ఫలితాల సీజన్‌ను ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ ఆశావహంగా ప్రారంభించిన నేపథ్యంలో ఈ వారంలో ప్రధాన కార్పొరేట్లు వెల్లడించే ఆర్థిక ఫలితాలు మార్కెట్ ట్రెండ్‌కు కీలకం అవుతాయని వివరించారు.
అంతర్జాతీయ పరిణామాలపై దృష్టిపెడుతూ ఇన్వె స్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తారని, దీనితో మార్కెట్‌లో కరెక్షన్లు జరుగుతాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు.