పెళ్లంటే.. పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు.. అనేది ఓల్డ్ ట్రెండ్. ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, హల్దీ కార్యక్రమాలు, ఖరీదైన ఫంక్షన్ హాళ్లు, లెక్కకుమించి వంటకాలు.. అంతకుమించి వెడ్డింగ్ డెస్టినేషన్స్ అనేది ప్రస్తుత ట్రెండ్. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా వెడ్డింగ్ డెస్టినేషన్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. సిటీ లైఫ్ నుంచి దూరంగా వివాహ వేడుకలు జరుపుకుంటూ, అద్భుతమైన అందాల నడుమ అందమైన జ్ఞాపకాలను సొంతం చేసుకుంటున్నారు. అందమైన కలల తీరంలో ఏడడుగులు వేస్తూ జీవితంలో మరిచిపోలేని వేడుకగా మధురానుభూతి పొందుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో కొన్ని అందమైన డెస్టినేషన్స్‌పై ఓ లుక్కేద్దామా..
పెళ్లి అంటే భారతీయ సమాజంలో ఒక పెద్ద పండుగ. సందడి, కోలాహలం, బంధుమిత్రుల రాకపోకలు, విశేషమైన ఆచార వ్యవహారాలు ప్రత్యేకమైన వన్నె తెస్తున్నాయి. ఖరీదైన బట్టలు, ఆభరణాలు, కార్ల బుకింగ్స్ వంటి వాటికోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. ఈ క్రమంలో వెడ్డింగ్ డెస్టినేషన్స్ బాగా ఊపందుకుంది.
మనదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు జైపూర్, ఉదయపూర్, గోవా లాంటివి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. దీంతోపాటు అందమైన బీచ్‌లు, హిల్ స్టేషన్లు, ప్రముఖ పర్యాటక ప్రాంతాలు వెడ్డింగ్స్‌కు అడ్డాగా మారుతున్నాయి. పచ్చని కొండలు.. వంపులు తిరిగే రోడ్లు, పైనుంచి ఆకాశగంగలా కురిసే జలపాతాలు లాంటివి ఆకట్టుకోవడంతో కాబోయే వధూవరులు క్యూ కడుతున్నారు.
ఉదయపూర్ సో స్పెషల్: మనదేశంలో అన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రదేశాలలో ఉదయపూర్‌ది ప్రత్యేక స్థానం. ఇది స్నేహపూర్వక వివాహాలకు ప్రసిద్ధ నగరం. ఇక్కడ స్పష్టమైన నీలి ఆకాశం, అద్భుతమైన రాజభవనాలు, సరస్సులు వివాహ వేడుకకు అత్యంత అద్భుతమైన సెట్టింగ్‌గా మారుతున్నాయి.
జైపూర్‌లో విలాసవంతంగా: పురాతన రాజభవనాలు, అద్భుతమైన కోటలు, గొప్ప భవనాలతో రాజస్థాన్‌లోని జైపూర్ అత్యంత విలాసవంతమైన వివాహ వేడుకలకు బెస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్‌గా కనిపిస్తుంది.
వివాహాన్ని ఇక్కడ రాయల్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ రాతితో చెక్కబడిన గోడలు, స్తంభాలు వివాహ ఫొటోగ్రఫీని ఎంతో అద్భుతంగా మారుస్తాయి. దీనికి తోడు స్థానిక పగిడి-వాలాలు, మెహందీ కళాకారులు, జానపద నృత్యకారులు, సారంగి వాద్యకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.
కేరళ బోట్ హౌస్‌లో: డెస్టినేషన్ వెడ్డింగ్‌కి కేరళ కూడా బెస్ట్ ఛాయిస్. అతిథులను మంత్రముగ్ధులను చేసే అనేక రిసార్ట్‌లు ఇక్కడ ఉన్నాయి. అరటి ఆకులపై దక్షిణ భారత వంటకాలను వడ్డించడం, సాంప్రదాయ హౌస్‌బోట్‌లో పార్టీని నిర్వహించడం ద్వారా వివాహ వేడుక గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది.
ఐలాండ్‌లో అందంగా: పట్టణాలకు దూరంగా ఏదైనా ఐలాండ్‌లో పెళ్లి వేడుక జరుపుకోవాలనుకుంటే అండమాన్ నికోబార్ మంచి డెస్టినేషన్. ఇక్కడ చాలా ప్రాంతాలు పర్యాటకులకు అందుబాటులో లేనప్పటికీ.. హేవ్‌లాక్ ద్వీపంలో వివాహం చేసుకోవడానికి అనేక సముద్రతీర రిసార్ట్‌లు ఉన్నాయి. చుట్టూ నీరు, ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పెళ్లి వేడుకను జరుపుకోవచ్చు.
గోవాలో సహజమైన బీచ్‌లు: మీరు సముద్రాన్ని ఇష్టపడి ఏదో ఒక బీచ్‌లో వివాహం చేసుకోవాలనుకుంటే.. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు గోవా బెటర్ ఆప్షన్. ఇక్కడి సహజమైన బీచ్‌లు, అద్భుతమైన సూర్యాస్తమయాలు, చారిత్రాత్మక చర్చిలు, అందమైన రిసార్టులు, పచ్చని అడవులు వివాహ ఫొటోగ్రఫీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఆగ్రా ప్రేమికుల స్వర్గధామం: డెస్టినేషన్ వెడ్డింగ్‌కు యూపీలోని ఆగ్రా కూడా ఉత్తమ ఎంపిక. ఇక్కడ ఉన్న తాజ్‌మహల్ మీలో సరికొత్త ప్రేమను కలిగిస్తుంది. వివాహ సమయంలో మూడు ముళ్లు వేయడానికి సిద్ధమవుతున్నప్పుడు.. మిమ్మల్ని మీ ప్రియమైన వారిని ఈ ప్రాంతం మరింత దగ్గర చేస్తుంది.