- మధ్య అరేబియాలో ఆవర్తనం
- రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే మధ్య అరేబియా సముద్రంలో ఆవర్తనం ఏర్పడినట్లు చెప్పింది. ఈ ఆవర్తనం కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ ఏపీకి వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అలాగే వర్షసూచన ఉన్న జిల్లాలకు ఐఎండీ ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.