calender_icon.png 22 September, 2024 | 5:06 PM

ఆపదలను తొలగించే మార్గం

20-09-2024 12:00:00 AM

గీతాయా నవమాధ్యాయం జపామి ప్రత్యహం నృప  

నిస్తీర్ణాశ్చాపదస్తేన కుప్రతి గ్రహ సంభవాః ॥

పూర్వం కురుక్షేత్రం అనే నగరంలో చంద్రశర్మ అనే రాజు ఉండేవాడు. ఆయన ఒకనాడు సూర్యగ్రహణ కాలంలో బ్రాహ్మణులకు కాలపురుష దానం చేయాలనుకుంటాడు. వెంటనే ఉత్తముడైన ఒక విప్రునికి యథావిధిగా కాలపురుష దానం చేశాడు. వెంటనే, ఆ కాల పురుష విగ్రహం నుండి చండాల దంపతులు ఉద్భవించి, దాన ప్రతి గ్రహీత అయిన ఆ బ్రాహ్మణుని బాధింపసాగారు.

కానీ, ఆ బ్రాహ్మణుడు వెంటనే ‘భగవద్గీత’లోని నవమ అధ్యాయాన్ని పారాయణం చేయడం మొదలుపెట్టాడు. అందులోని ఒక్కొక్క అక్షరం నుండి ఒక్కొక్క విష్ణుదూత ఆవిర్భవించి, ఆ చండాల దంపతులను దూరంగా పారద్రోలారు. అది చూసిన రాజు ఆశ్చర్యానికి గురై, “ఏ మంత్రం జపించడం వల్ల ఈ భయంకరమైన ఆపదను దాటగలిగావు?” అని బ్రాహ్మణుని అడిగాడు. దానికి ఆయన గీతలోని ‘నవమ అధ్యాయం’ గురించి చెప్పాడు. “ఇప్పుడే కాదు, నేనెప్పుడూ ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తుంటాను. దానివల్ల సమస్త ఆపదలు, ప్రతి గ్రహణ దోషాలు తొలగి పోతున్నాయి” అన్నాడతను. రాజు వెంటనే అతనినుండి ‘భగవద్గీత’లోని 9వ అధ్యాయాన్ని అభ్యసించి, తానుకూడా నిత్యం పారాయణం చేసి ముక్తి పొందాడు.