సంసారానికైనా, వ్యాపారానికైనా, పెద్ద సంస్థలకైనా, చివరకు ప్రభుత్వాలకైనా ఖర్చుల విషయంలో ‘అదుపు’, ‘పొదుపు’ తప్పనిసరి. లేకపోతే, ‘పెరుగుట కాస్తా విరుగుట’కు దారితీయవచ్చు. అప్పులు ఎన్ని చేసినా, కొత్త ఆదాయ మార్గాలు ఎప్పటి కప్పుడు కనిపెడుతున్నా కొన్ని అనవసర వ్యయాలను తగ్గించుకోగలగడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ మెరుగు పడుతుంది. ఎన్నికలు ఏవైనా, ఎప్పుడైనా, అవి రాష్ట్ర ప్రభుత్వాలవి అయినా, కేంద్ర ప్రభుత్వానివి అయినా నిర్వహణ కోసం వెచ్చించేది ప్రజల సొమ్మే కనుక, భారీ వ్యయాల నియంత్రణ దిశగా రాజకీయ పార్టీలు ఇప్పటికైనా అడుగులు వేయగలిగితే మంచిది.
ప్రభుత్వాలకు అయిదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా అయ్యే ‘ఎన్నికల నిర్వహణ వ్యయం’ దేశ స్వాతం త్య్రం తర్వాత గడచిన ఏడున్నర దశాబ్దాలుగా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నదే తప్ప అదుపులోకి రా వడం లేదు. పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత వ్యయాల విష యం అలా వుంచి, ప్రభుత్వాలు చేసే ప్రజ ల సొమ్ము వినియో గమవుతున్న తీరు విషయంలోనైనా బాధ్యతగల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆలోచి ంచవలసి ఉంది. పెరిగే ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లను పెంచుకొంటూ పోవడం నుంచి ఈవీఎంల సరఫరా వరకు ఎన్నికల ప్రక్రియలో ప్రతిదీ రానురాను ఎంతో ఖరీదైన వ్యవహారంగా మారుతున్నది. ఇంట్లో పెళ్లి అంటేనే విపరీతమైన ఖర్చులుంటాయి. మామూలుగా రూపాయికి జరిగే పనికో సం పది రెట్లు వెచ్చించాల్సి వస్తుంది. అ లాంటిది ఎన్నికలంటే చాలు, చాలామం ది వ్యాపార దృక్పథం గలవారికి పెద్ద పండగే.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. 18వ లోక్‌సభ ఎన్నికల పోలి ంగ్ ప్రక్రియ శుక్రవారంతో మొదలైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు/ కేం ద్ర పాలిత ప్రాంతాలలోని 102 స్థానాల్లో ఓటింగ్ పూర్తయింది. ఈనెల 26వ తేదీన రెండో దశ, మే 7 నుండి 25వ తేదీ వరకు మరో నాలుగు దశలు, జూన్ 1న ఆఖరు దశ పోలింగ్‌తో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం 7 దశలలో జరిగే ఈ ఎన్ని కలలో దేశంలోని సుమారు 96.8 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న మన దేశ జాతీయ స్థాయి ఎన్నిక లు ఎప్పుడు జరిగినా, వాటి సరళి, విధి విధానాలు, ఫలితాల పట్ల అంతర్జాతీయంగా ఎంతో ఆసక్తికరమేకాక ప్రతిష్ఠాత్మ కమూ అవుతుంది.
మూడున్నర వేల కోట్లకు!
పదేళ్ల బీజేపీ పాలన తర్వాత కాంగ్రెస్ రెండు దఫాలుగా దేశాధికారానికి దూరమైన నేపథ్యంలో జరుగుతున్న ఈ సాధా రణ ఎన్నికలు ఎంత ఖరీదైన వ్యవహారం గా మారాయో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. 1952లో భారతదేశ పార్లమెంటు కోసం జరిగిన లోక్‌సభ సాధారణ ఎన్నికల కోస ం రూ. 10.5 కోట్లు మాత్రమే ఖర్చు కాగా, ఆరు దశాబ్దాల తర్వాత 2014 ఎన్నికల నాటికి అది రూ.3,870 కోట్లకు పెరిగింది. ఈ పదేళ్లలో ఇంకెంత పెరిగే అవకాశం వుందో ఊహించుకోవచ్చు.
ఇక, అభ్యర్థుల వ్యక్తిగత వ్యయాలైతే రాకెట్లవలె దూసుకుపోతున్నాయి. అంత ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం వారికేమిటి? ఒకవేళ గెలిస్తే, వాళ్లు అంతకు పదిరెట్లు ‘ఎలాగోలా’ (అక్రమంగా తప్ప, సక్రమంగానైతే అవకాశమే వుండదు) సంపాదించకుండా ఎలా వుండగలరు? సీఎం నుంచి పీఎం వరకు, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీల వరకు ఇవాళ ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న వేతనాలు, ప్రభుత్వం నుంచి పొం దుతున్న ఇతరత్రా ప్రయోజనాలు, ఆర్థిక లబ్ధి, అధికార హోదా వంటివన్నీ పెరుగుతున్న ఎన్నికల వ్యయ రుగ్మతకు పరోక్షం గా దోహదం చేస్తున్నట్టుగానే భావించాలి.
అతి ప్రజాస్వామ్యం, అత్యధిక ఖర్చు
అరవై ఏళ్ల కిందటికి, ఇప్పటికి దేశంలో మారిన సామాజిక పరిస్థితులన్నీ రాజకీయాలను సేవా రంగంలోంచి తప్పించి, వ్యాపార సామ్రాజ్యాలకు చౌకైన సోపానాలుగా మార్చేశాయి. భారతదేశ వ్యాప్తంగా సాధారణ ఎన్నికల నిర్వహణ అంత తేలికైన విషయం కాదు. దేశవ్యాప్త ఓటర్ల జా బితాను ఎన్నికల సంఘం (ఈసీ) ముందే సిద్ధం చేసుకోవలసి వుంటుంది. 2022లో ని ఒక అంచనా ప్రకారం 141.72 కోట్ల భా రీ జనాభాలో 96.8 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కు అర్హతను పొందారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియగా అభి వర్ణించిన ఈసీ, ప్రజాస్వామ్య సంరంభం జరుపుకోవడానికి భారతదేశం సిద్ధమైందన్న విశ్వాసాన్ని ఈ ఎన్నికల వేళ వ్యక్త పరిచింది. అయితే, ఇదే సమయంలో అన్ని కోట్ల ఓటర్లు పాల్గొనే ఎన్నికలను నిర్వహించడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించవలసి వస్తున్నది కూడా. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల శాసనసభలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సభల విషయమలా వుంచి, కేవలం లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి ఐదే ళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాలు భరిస్తున్న వ్యయం తక్కువేమీ లేదు.
అమెరికా వ్యయాన్ని మించిపోయాం!
1957 ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే ఎన్నికల వ్యయం కొంత తగ్గినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికైన నాటికి అనూహ్యంగా రూ.3,870 కోట్లు ఖర్చయింది. న్యూఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ అంచనా మేరకు 2019లో ఎన్నికలలో మొత్తం వ్యయం రూ. 50,000 కోట్ల (7 అమెరికన్ బిలియన్ డాలర్లు) విపరీత స్థాయికి చేరుకున్నట్టు చెబుతున్నారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అయిన వ్యయం అంతకంటే తక్కువే (6.5 బిలియన్ డాలర్లు) అని ‘ఓపెన్‌సీక్రెట్ ఆర్గ్’ పేర్కొంది. మరొక కోణంలో చూసినప్పు డు 1951లో భారత ఎన్నికల సంఘం ఒక్క ఓటరు మీద 6 పైసలు మాత్రమే వెచ్చిస్తే, 2014లో అయిన వ్యయం ప్రకారం అది 46 రూపాయలు.
ఈ మేరకు ఈసారి మొ త్తం ఎన్నికల వ్యయం 1 లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యం వుండదేమో. ఎన్నికల సందర్భం గా ‘ఎన్నికల సంఘం’ ఖచ్చితంగా ‘ఏఏ అధికారిక విషయాల కోసం ప్రభుత్వ సొమ్మును వెచ్చిస్తుంది?’ అన్నది తెలుసుకోవాల్సిన అంశమే. భద్రతా దళాల నిర్వ హణ, పోలింగ్ బూత్‌ల స్థాపన, ఈవీఎం ల సరఫరాతోపాటు ఎలక్షన్ వస్తువు లైన వేలుకు పెట్టే ‘తినదగిన సిరా’ (ఇంకు) వంటి వాటిని సమకూర్చుకోవడం, అధికారులు, సిబ్బందికి అవగాహనా తరగతుల నిర్వహణ వంటివన్నీ వుంటాయి. అన్నింటి లోకెల్లా ఈవీఎం సేకరణకే గణనీయ ంగా ఖర్చు పెట్టవలసి వస్తున్నట్టు తెలుస్తున్నది.
2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈవీఎంల పైన వెచ్చించే మొత్తం కూడా పెరిగి నట్టు సమాచారం. ఈవీఎంల కోసం మొట్టమొదటి బడ్జెట్ కేటాయింపు రూ.౨౫ కోట్లు కాగా, తాజా బడ్జెట్‌లో అది రూ. 1,891.8 కోట్లకు చేరుకుంది. ఇది కాక, మరో రూ. 611.27 కోట్ల అవసరం వున్న ట్టు కూడా చెబుతున్నారు. తర్వాత ‘పరిపాలనా సంబంధ వ్యయం’ అత్యధికంగా ఉంటున్నట్టు తెలిసింది. పోలింగ్ సంబంధ సిబ్బందికి, వలంటీర్లకు, అధికారులకు, శిక్షణా సెషన్స్‌కు హాజరయ్యే వారికి ఈసీ డబ్బు చెల్లించవలసి వుంటుంది. వాటికి సంబంధించిన ప్రచారానికి, వీడియోగ్రాఫ్స్ కూడా ఊరికే రావు. వీటన్నింటి ఖర్చులు పెద్ద ఎత్తున పెరిగినట్టు చెబుతున్నారు.
భారీ ఏర్పాట్లు, సుదీర్ఘ ప్రక్రియ
దేశంలోని తొలి లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 53 రాజకీయ పార్టీలకు చెందిన 1,874 మంది అభ్యర్థులు 401 నియోజకవర్గాల కోసం పోటీలో వుండగా, అప్పుడు 1.96 లక్షల పోలింగ్ బూత్‌లు అవసరమైనాయి. 2019లో అనూహ్యం గా, 543 నియోజక వర్గాలకు గాను 673 రాజకీయ పార్టీల నుంచి పోటీలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య 8,054 మందికి పెరిగింది. ఇందుకోసం ఈసీ ఏర్పాటు చేసిన బూత్‌లు 10.37 లక్షలు. ఒక్క కేంద్ర ప్రభుత్వమే అయి నా, రాష్ట్రాలతో పంచుకొన్నా, మొత్తం మీద ప్రభుత్వ పరంగా అవుతున్న ఎన్నికల వ్యయమంతా చిట్టచివరకు భరించవలసింది ప్రజలే. సుదీర్ఘ కాలం పాటు ఎన్నిక లు జరుగుతుండటం వల్ల కూడా కొంత అధిక వ్యయం చేయవల్సివస్తుంది. ఈసారి ౭ దశలలో 44 రోజులు పోలింగ్ ప్రక్రియ జరుగుతుండగా, ఏప్రిల్ 19తో మొదలై జూన్ 1వ తేదీతో ముగుస్తున్నది. జూన్ 4న ఫలితాలు వెలువడటంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. 1951 ఎన్నికల తర్వాత ఇంత సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్న ఎన్నికలు ఇవే.
1951 జరిగిన భారతదేశ మొట్టమొదటి సాధారణ ఎన్నికల్లో అందరు ఓటర్ల చేత ఓటుహక్కులను వినియోగింపజేయడానికి మొత్తం 68 దశల ప్రక్రియను జరిపారు. అలాంటిది, ఇవాళ కేవలం ఏడు దశల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయ గలుగుతున్నాం. బ్యాలెట్ బాక్సు ల నుంచి ఈవీఎంల వరకూ వచ్చాం. అతితక్కువ కాలంలో, పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు కోసం కంప్యూటర్ల సాంకేతికతను వినియోగిం చుకోగలుగుతు న్నాం. సాంకేతికంగా, కార్యాచర ణ పరంగా నాటికి నేటికీ మనం చా లావరకు అభివృద్ధి చెందినా, ఎన్నికల వ్యయ విషయంలో మాత్రం జీర్ణించుకోలేని దుస్థితిలోకి నెట్టబడ్డాం.
దోర్బల బాలశేఖరశర్మ