calender_icon.png 15 November, 2024 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

118 జీవోపై మాటల యుద్ధం

10-11-2024 12:22:01 AM

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నడుమ పరస్పర ఆరోపణలు

ఎల్బీనగర్, నవంబర్ ౯:  ఎల్బీనగర్ నియోజకవర్గంలో 118 జీవో అమలుపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నడుమ మాటల యుద్ధం నడుస్తోంది. ఓట్ల కోసమే బీఆర్‌ఎస్ జీవో తెచ్చిందని కాంగ్రెస్ విమర్శించగా.. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జీవోను అమలు చేయ డం లేదని బీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు.

ఇటీవల 118 జీవో బాధితులు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే, బీఎన్‌రెడ్డి డివిజన్‌లోని సాగర్ కాంప్లెక్స్ నివాసితులతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమావేశమయ్యారు.  

జీవో నేపథ్యం 

బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లతో పాటు స్థలాలను క్రమబద్ధీకరించడానికి 2022లో 118 జీవో తెచ్చింది. ఎల్బీనగర్ నియోజకవర్గంతో పాటు నగరంలోని మరో ఐదు నియోజకవర్గాల్లో 44 కాలనీల ప్రజల ప్రయోజనార్థం ఈ జీవో తీసుకొచ్చారు. సుమారు 15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్య ఈ జీవోతో తీరుతుందని భావించారు.

గజానికి నామమా త్రపు ఫీజు రూ.250 చొప్పున ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరిస్తున్నట్లు 2022 నవంబర్‌లో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రకటించారు. అయితే, 2024 ఎన్నికల సమ యం నుంచి ఎల్బీనగర్ నియోజక వర్గంలో జీవో అమలు కాకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యం గా బీఎన్‌రెడ్డి డివిజన్‌లోని అనేక కాలనీల్లోని ఇంటి స్థలాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో ఇక్కడ క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. హుడా, హెచ్‌ఎండీ ఏ, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి పొందిన లేఅవుట్లే ఉన్నా వివిధ కారణంతో ఇక్కడి స్థలాలను 2008లో రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా (22 చేర్చారు.

దీంతో 2008 ముందు ఉన్న స్థలాలు, ఇళ్లకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉన్నట్లు ప్రకటించారు. 2008 తర్వాత ఇక్కడి స్థలాల క్రయవిక్రయాలపై నిషేధం పడింది. నిషేధిత జాబితాలో ఉన్నా ఇక్కడి ప్లాట్ల విక్రయాలు కొనసాగుతునే ఉన్నాయి. రిజిస్ట్రేష న్లు ఆగిపోయినా నిర్మాణాలు కొనసాగాయి. నిషేధిత జాబితాలో ఉన్న స్థలాల్లో 80 శాతం నిర్మాణాలు జరిగాయి.

కానీ, అధికారికంగా రిజిస్ట్రేషన్లు కాకపో వడంతో ఆదాయం ప్రభుత్వానికి చేరడం లేదు. దీనిపై అప్పటి, ఇప్పటి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, సమస్య పరిష్కారానికి మంత్రులతో సబ్ కమిటీ వేశారు. ఇక్కడ స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, నిర్మాణాలు, స్థలాలను క్రమబద్ధీకరించాలని బీఆర్‌ఎస్ ప్రభు త్వం నిర్ణయించింది.

ఈ మేరకు 118 జీవో అమలు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. అక్రమ నిర్మాణాలన్నింటికీ బీఆర్‌ఎస్(బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీం) వర్తింపజేయాలని నిర్ణయించారు. అయితే, ఎన్నికల సమయంలో జీవో అమలు ఆగిపోయింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసినా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 118 జీవో అమలు కావడం లేదు. దీంతో మాటల మంటలు చెలరేగుతున్నాయి.   

ఓట్ల కోసమే జీవో తెచ్చారు

2024 ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసమే 118 జీవో తెచ్చిందని ఇటీవల పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేయాలని మధుయాష్కీగౌడ్‌ను గత అక్టోబర్ 28న బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లోని వైదేహినగర్ కాలనీ ప్రతినిధులు కలిసి కోరారు.

ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తన గెలుపు కోసమే 118 జీవో తెప్పించారని విమర్శించారు. తెచ్చిన జీవోను కూడా సరైన పద్ధతిలో కాకుండా కొందరికి లాభం చేకూరేలా తీసుకొచ్చారని ఆరోపించారు.

అర్హులైన పేదలకు 118 జీవో ఫలాలు అందకుండా చేశారని మండిపడ్డారు. కన్వీనియన్స్ డీడ్‌కు అసలు విలువే ఉండదని, రుణాలు రావని, ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లకు విలువ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 118 జీవో బాధితులకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు.

- మధుయాష్కీ గౌడ్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్

జీవో అమలుకు కాంగ్రెస్సే అడ్డు

2008 నుంచి ఉన్న సమస్యను పరిష్కరించడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 118 జీవోను తెచ్చిందని, ఎన్నికల కోసం కాదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. గత అక్టోబర్ 29న బీఎన్‌రెడ్డి డివిజన్‌లో 118 జీవో బాధితులతో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే.. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో అమలును నిలిపివేసిందన్నారు.

తమ హయాంలో 80 శాతం బాధితులకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. అందరికీ కన్వీనియన్స్ డీడ్ ఇచ్చామని, కొన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి కన్వీనియన్స్ డీడ్ ఇచ్చేవరకు ప్రభుత్వంపై పోరాడతానని తెలిపారు.

118 జీవోను పూర్తిగా అమలు చేస్తే సుధీర్‌రెడ్డికి పేరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ జీవోను అమలు చేయడం లేదని ఆరోపించారు. భవిష్యత్‌లో నేనే ముఖ్యమంత్రిని, లేకుంటే ఉప ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకుంటున్న మధుయాష్కీగౌడ్.. ఎందుకు జీవోను అమలు చేయించడం లేదని ప్రశ్నించారు. 

- సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే