calender_icon.png 28 December, 2024 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిశ మార్చిన దార్శనికుడు

28-12-2024 03:54:59 AM

పీ సత్యప్రసాద్ :

మన్మోహన్‌సింగ్ 1991లో తన తొలి బడ్జెట్ ప్రసంగంలో ‘ఒక ఆలోచనకు సమయం వచ్చినపుడు భూమ్మీద ఏ శక్తి దానినిఅడ్డుకోలేదు’ అన్న విక్టర్ హ్యుగో కొటేషన్‌ను ప్రస్తావిస్తూ ‘ప్రపంచంలో ప్రధాన ఆర్థికశక్తిగా భారత్ ఆవిర్భవించాలన్న ఆ లోచనే ఈ బడ్జెట్’ అంటూ ప్రతి పాదనలు సమర్పించారు.

ఆ సంచలన బడ్జెట్టే భారత్ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చివేసి వృద్ధిపథంలో నడిపిం చింది. ఇప్పుడు ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి, మరికొద్ది ఏండ్లలో మూడో స్థానానికి ఎగబాకేందుకు పునాది వేసింది మన్మోహన్ సింగే అనేది పార్టీలకు అతీతంగా అందరూ అంగీకరించే వాస్తవం.

1990 దశకం తొలినాళ్లలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు న్న దేశ ఆర్థిక వ్యవస్థను గట్టేంక్కించేందుకు అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు రాజకీయ స్థుర్యైంతో ఆర్థిక మంత్రి గా టెక్నోక్రాట్ అయిన మన్మోహన్‌ను ఎంచుకోవడమే ఆలస్యం ఆర్థిక సంస్కరణలు ఉరుకులు పరుగులతో ప్రారంభమై పోయాయి. 

ఆర్థిక వ్యవస్థను సరళీకరించి సోషలిస్ట్ పంథాను మార్కెట్ ఎకానమీ బాటలోకి మళ్లించడం, ప్రభుత్వ నియంత్రణలు తగ్గించడం, విదేశీ పెట్టుబడుల్ని ప్రోత్సహించడం తదితర సంస్కరణ విధానాలు క్రమేపీ ఆర్థికాభివృద్ధికి దోహదం చేశాయి.

ప్రభుత్వం కల్పించే ఉపాధి అవకాశాలకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రై వేటు రంగంలో ఏర్పడడానికి, రేషన్‌లో నో, బ్లాక్‌మార్కెట్లోనో అష్టకష్టాలు పడితే లభించే ఉత్పత్తులు మార్కెట్ ధరలకే అందుబాటులోకి రావడానికి, ప్రపంచం లో ఆవిష్కృతమయ్యే కొత్త టెక్నాలజీలను వెనువెంటనే దేశంలోకి తీసుకురాగలగడానికి మన్మోహన్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలే నాంది పలికాయనడంలో అతిశయోక్తి లేదు. 

ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం

మన్మోహన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితుల్లో ఉంది. దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు కొద్దివారాలకు సరిపడా అత్యవసర దిగుమతులకు మాత్రమే సరిపోయే పరిస్థితి. రష్యా విచ్ఛిన్నంకాకముందు ఆ దేశంతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా యూఎస్ డాలర్లు లేకపోయినా, చౌకగా ముడిచము రు, ఇతర ముడి పదార్థాలు దిగుమతి చేసుకోగలిగేది.

అలాగే భారత్ ఉత్పత్తుల ఎగుమతులకు రష్యా మార్కెట్ అందుబాటులో ఉండేది. ఐఎంఎఫ్ నుంచి భారీ మొత్తాల్ని అప్పుచేసినా, విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ‘ఇప్పుడు ఇండియా క్రాస్‌రోడ్స్‌లో ఉన్నది.

ఈ దశలో మనం నిర్ణయాలు తీసుకోవాలా? వద్దా అనే దే రానున్నకాలంలో దిశను నిర్దేశిస్తుంది. మనం ఎం చుకునే బాటపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుం ది. అందులో ఆశ్చర్యమేమీ లేదంటూ’ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 

ప్రధాన సంస్కరణలివే..

* రూపాయి విలువ తగ్గింపు: డాలరు పెట్టుబడుల్ని ఆకర్షించడానికి రూపాయి విలువను రెండు దఫాలుగా 19 శాతం తగ్గించివేశారు. 

* లైసెన్స్‌రాజ్ రద్దు: కొన్ని రంగాలకు మినహా పలు రంగాల్లో పరిశ్రమలకు లైసెన్సు తీసుకునే పద్ధతినే రద్దు చేశారు. వ్యాపారాలు స్వేచ్ఛగా నిర్వహించుకునే వీలు కల్పించారు.

* విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపు: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అనుమతిస్తేనే పరిశ్రమలకు మూలధనం, టెక్నాలజీ అందు తుందని, ఆ ఉత్పత్తులకు మార్కెట్ ఏర్పడుతుందంటూ కొన్ని ప్రాధాన్య పరిశ్రమల్లో మెజారిటీ 51 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అనుమతించారు. 

* దిగుమతి టారిఫ్‌ల తగ్గింపు, ఎగుమతి ప్రోత్సాహకాల కుదింపు: భారత పరిశ్రమ విదేశీ పోటీకి సిద్ధంకావాల్సిన సమయం వచ్చిందంటూ ఎగుమతి, దిగుమతి విధానంలో సమూల మార్పులు చేశారు. ఎగుమతులకు సబ్సిడీల ఎత్తివేత, దిగుమతుల్ని పెంచుకోవడానికి టారీఫ్‌లు తగ్గింపును ప్రకటించారు. 

* పీఎస్‌యూ సంస్కరణలు: ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన ఆధునిక టెక్నాలజీని, కీలక మౌలిక వసతుల్ని కల్పించుకోవడానికి అవి పబ్లిక్ నుంచి నిధుల్ని సమీకరించే అవకాశాన్ని కల్పించారు. ఎంపికచేసిన పీఎస్‌యూల్లో 20 శాతం ప్రభుత్వ వాటాను పబ్లిక్‌కు విక్రయించే ప్రతిపాదన తీసుకొచ్చారు. 

ప్రముఖుల నివాళి

ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శుక్రవారం ప్రముఖలు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. ఢిల్లీలో ఉన్న ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మన్మోహన్ కుటుంబసభ్యులను ఓదార్చారు.

నివాళులు అర్పించిన వారిలో ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, దేశ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తదితరులు ఉన్నారు.

ఇక అనేక రాష్ట్రాల్లో స్థానిక నాయకులు, మన దేశం నుంచే కాకుండా వివిధ దేశాల అధిపతులు, రాజకీయ నాయకులు కూడా మన్మోహన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. 

మన్మోహన్ అరుదైన రాజకీయ నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అరుదైన రాజకీయ నాయకుడు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో ఆయన పాత్ర మరువలేనిది.

 ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి

ఆయన మరణ వార్త బాధ కలిగించింది

గొప్ప ఆర్థిక వేత్త అయిన మాజీ ప్రధాని మరణవార్త ఎంతో బాధ కలిగించింది. ఆయనతో కలిసి పని చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. 

 జగదీప్ ధన్‌ఖడ్, ఉపరాష్ట్రపతి

ఆర్థిక వేత్తగా దేశానికి ఎనలేని సేవ చేశారు

ఒక ఆర్థిక వేత్తగా మన్మోహన్ సింగ్ దేశానికి ఎనలేని సేవ చేశారు. క్లిష్టపరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. పీవీ నేతృత్వంలో దేశాన్ని ఆర్థిక రంగంలో పరుగులు పెట్టించిన తీరు అమోఘం.

 నరేంద్ర మోదీ, భారత ప్రధాని

తరతరాలు గుర్తుంచుకుంటాయి

మీరు చేపట్టిన ఆర్థిక విధానాలు, ప్రవేశపెట్టిన పథకాలతో తరతరాలు మిమ్మల్ని గుర్తుంచుకుంటాయనడంలో సందేహం లేదు.

 మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

వ్యక్తిగతంగా తీరని లోటు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం వ్యక్తిగతంగా ఎంతో లోటు. ఆయన నాకు స్నేహితుడు మాత్రమే కాదు. నాకు మార్గనిర్దేశకుడు. ఎన్నో విషయాల్లో ముందుండి నన్ను నడిపించాడు. ఆయన అపార ప్రతిభా వంతుడు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఆయన పని చేశారు. 

 సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకురాలు

దేశాన్ని సమగ్రతతో ముందుకు తీసుకెళ్లారు

మన్మోహన్ సింగ్ దేశాన్ని తన తెలివి, సమగ్రతతో ముందుకు తీసుకెళ్లారు. ఆయన మానవత్వం, ఆర్థిక విషయాలపై ఆయనకున్న అవగాహన దేశాన్ని ఎంతో ప్రభావితం చేసింది. 

 రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేత