* రెండు గుటకలు వేశాక గుర్తించిన బాధితుడు
నాగర్‌కర్నూల్ జనవరి 16 (విజయక్రాంతి): ఉపశమనం కోసం ఓ కూలీ కల్లు తాగేందుకు వెళ్తే అందులో కట్ల పాము రావడం కలకలం సృష్టించింది. దీంతో గ్రామస్తులంతా కోపంతో కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లిలో గురువారం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురువారం సాయంత్రం కల్లు దుకాణంలో కల్లు సీసా కొని, నోటికి అందుకున్నాడు. రెండు గుటకలు వేశాక కల్లు సీసాలో ఏదో కదులుతూ కనిపంచడంతో కొద్దిగా పారబోస్తుండగా అందులో నుంచి సుమారు ఆరు ఈంచుల కట్లపాము బయటపడింది.
ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదేంటని కల్తీ కల్లు తయారీ చేసే యజమానిని ప్రశ్నించగా నేలచూపులు చూశాడు. దీంతో కోపంతో రగిలిపోతూ గ్రామస్తులంతా దుకాణాన్ని కల్లు సీసాలను ధ్వంసం చేశారు. ఇదే విషయంపై జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారిణి గాయత్రిని వివరణ కోరగా విషయం తన దృష్టికి రాలేదంటూ బదులిచ్చారు.