ములుగు జిల్లా పర్యటనలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
హనుమకొండ, ఆగస్టు 28 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏజెన్సీలోని ఏదేని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గవరర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. బుధవారం ఆయన ములుగు జిల్లాలోని లక్నవరం చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దత్తత తీసుకున్న గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తొలుత గవర్నర్ హనుమకొండలోని వేయిస్తంభాల గుడి, వరంగల్‌లోని భద్రకాళి, రుద్రేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు.
ఆలయ అధికారులు, అర్చకులు గవర్నర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. రామప్ప, వేయిస్తంభాల గుడి నిర్మాణాలు అద్భుతమని కొనియాడారు. గవర్నర్ వెంట రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.