calender_icon.png 11 January, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెబాట పట్టిన పట్నం

11-01-2025 01:47:58 AM

* సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న నగరవాసులు

* ప్రయాణికులతో బస్టాండులు కిటకిట

* పండుగ సందర్భంగా ప్రత్యేకంగా 6,462 ఆర్టీసీ బస్సు సర్వీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (విజయక్రాంతి): భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకొనేందుకు వెళ్లే ప్రయాణికులతో శుక్రవారం హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ, జేబీఎస్ బస్టాండ్‌లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచీగూడ రైల్వేస్టేషన్లు కిటకిటలాటాయి. నగరంలోని మియాపూర్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, లకిడీకపూల్, ఉప్పల్, ఎల్‌బీ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, మెహిదీపట్నం, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాలు రద్దీగా దర్శనమిచ్చాయి.

అలాగే శనివారం నుంచి 17వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవు. దీంతో విద్యార్థులతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలతో పేరుతో నగరానికి వచ్చిన వారంతా ఇప్పుడు స్వస్థలాలకు వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం మొత్తం 6,462 ప్రత్యేక బస్సు సర్వీసులు కేటాయించింది.

ఆర్టీసీ యాజమాన్యం అదనంగా ఛార్జీలు వసూలు చేయడం లేదని, ఎప్పటిలాగానే చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కానీ.. అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారంటూ కొందరు ప్రయాణికులు వాపోతున్నారు. అలాగే పండగ సీజన్‌ను అదునుగా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మూడింతల ఛార్జీలను వసూలు చేస్తున్నా, కొందరు తొందరగా ఇంటికి చేరుకోవాలని అంత చార్జీ ఇచ్చి మరీ వెళ్తున్నారు.