calender_icon.png 3 October, 2024 | 9:59 AM

స్వస్థలానికి గల్ఫ్ బాధితుడు

02-10-2024 02:13:23 AM

రాజేంద్రనగర్, అక్టోబర్ 1: నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ చిత్రహింసలకు గురికావడంతో అతడు ఓ సెల్ఫీ వీడియో తీసి తన గోడును వెల్లబోసుకున్నాడు. వీడియో వైరల్‌గా మారడంతో తెలంగాణ సర్కారు స్పందించి కువైట్ నుంచి అతడిని రప్పించింది. బాధితుడి కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన నాందేవ్ ఏడాది క్రితం తెలిసిన ఏజెంట్‌కు రూ.1.2 లక్షలు చెల్లించి కువైట్ వెళ్లాడు.

అక్కడ హౌస్ కీపింగ్ పనిచేయాల్సి ఉంటుందని ఏజెంట్ చెప్పడంతో నాందేవ్ గుడ్డిగా నమ్మాడు. నెలరోజుల తర్వాత యజమాని బాధితుడిని కువైట్ నుంచి సౌదీ సరిహద్దు దాటించాడు. ఒంటెల కాపరి ఉద్యోగం ఇచ్చాడు.  బాధితుడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

తన దుర్భర జీవితంపై ఇటీవల బాధితుడు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్త వైరల్ అయింది. రాష్ట్ర సర్కారు దృష్టికి వెళ్లింది. సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని కువైట్ నుంచి బాధితుడిని క్షేమంగా తెలంగాణకు చేరుకున్నాడు. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం ఆనందోత్సాహాలతో స్వస్థలానికి వెళ్లాడు.