calender_icon.png 1 April, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరుకే పశువుల దవాఖాన !

31-03-2025 12:00:00 AM

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా ! పత్తాలేని ఏడీ

కామారెడ్డి, మార్చి 30, (విజయ క్రాంతి): పేరుకే అది పశువుల దవఖాన... అక్కడ పశువులకు వైద్యం ఉండదు. వైద్యం చేసే అధికారి కనిపించడు. ఇది కామారెడ్డి జిల్లా లోని  పాత తాలూకా అయిన దోమకొండ మండల కేంద్రంలో  పశువుల దావఖాన తీరు ఇది, పశువుల ఆసుపత్రిలో వైద్యులు లేక  ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్న దావఖాన, ఈ దవఖాణలో డాక్టర్లు ఉన్నారా ?  లేరా ?  తెలియక రైతులు తికమక పడుతున్నారు.

పశువులకు వ్యాధులు వచ్చినప్పుడు పశువైద్యులకు చూపెడదామంటే అందుబాటులో ఉండడం లేదు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ ఆస్పత్రిలో విధులు నిర్వహించాల్సి ఉన్న ఏనాడు తన కార్యాలయానికి వచ్చిన దాఖలాలు లేవనీ స్థానికులు ఆరోపిస్తున్నారు. పశు వైద్యశాలలో వైద్యులు విధులు నిర్వహించాల్సి ఉన్న నిర్లక్ష్యంతో సక్రమంగా రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.  పర్యవేక్షణ చేయాల్సిన అధికారి ఏడి విధులకు రాకపోవడంతో పర్యవేక్షణ లోపం వల్ల పశు వైద్యులు రావడంలేదు.

ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

పశువుల ఆసుపత్రికి వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో సిబ్బంది కూడా లేకపోవడం  వల్ల రాత్రి అయితే చాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తూ నెల నెల లక్షల రూపాయలు వేతనంగా పొందుతున్న వైనం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జరుగుతోంది. 

అసిస్టెంట్ డైరెక్టర్ అడ్రస్ ఎక్కడ....?

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గల పశువుల ఆసుపత్రిలో గత కొన్ని సంవత్సరాలు గా అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి రెండు మూడు సంవత్సరాలుగా నెలకు లక్షల రూపాయలు ప్రభుత్వ ప్రజల సొమ్ము వేతనంగా పొందుతూ ఏ ఒక్కనాడు ఆసుపత్రికి వచ్చి వెళ్లిన సందర్భాలు లేవనీ , ఒక్కరోజు కూడా పశువుల దావఖానకి రానటువంటి పశు వైద్యులకు నెలవారి జీతాలు ఎలా వస్తున్నాయని, హాజరు రిజిస్టర్ లో రోజువారి సంతకం లేకుండా జీతాలు ఎలా పొందుతున్నారని గ్రామస్తులకి ప్రశ్నార్ధకంగా మారిం ది.

కార్యాలయానికి రాని అధికారి లక్షలాది రూపాయలు ప్రజల సొమ్మును తీసుకుంటూ దుర్వినియోగం చేసినట్లే అవుతుం దని స్థానిక రైతులు  వాపోతున్నారు. డాక్టర్ లేక ఆసుపత్రిలో తాము పశువులను తీసుకొస్తే చూసేవారు లేక తాము వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని కిందిస్థాయి సిబ్బంది సైతం పశువుల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పశువులకు  నిరోధ చర్యల్లో భాగంగా అన్ని జిల్లాలలో మండల కేంద్రాలలో వెటర్నరీ సిబ్బంది వైద్య బృందంతో పాటు సిబ్బంది గ్రామాలకు వెళ్లి గొర్రెల మంద వద్ద పశువుల సంత వద్ద ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వ్యాధులు రాకుండా అవగాహన సదస్సులు చికిత్సలు చేస్తుంటే దోమకొండ ఆసుపత్రికి చెందిన ఏ డి ఆ సిబ్బంది ఏ ఒక్కనాడు ప్రత్యేక శిబిరం పెట్టిన సందర్భాలు లేవు.

రైతులు విలేకరులతో మాట్లాడుతూ ఈ సాల్రు ఏ ఒక్కనాడు వచ్చిన దాఖలా లేవని కాంపౌండర్ ఒకరు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటాడని పెద్ద సార్ అయితే ఇంతవరకు తాము మొఖం కూడా చూడలేదని వివరించారు. ఏడి విధుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని తక్షణమే విధుల్లోంచి తొలగించి వేరే ఒకరిని ఇక్కడికి బదిలీ చేసి పశువులను కాపాడేందుకు అధికారి నియమించాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.

శిథిలావస్థకు చేరిన పశు వైద్యశాల

దోమకొండ లోని పశువుల ఆస్పత్రి శిధిలావస్థకు చేరుకున్న దాని గురించి పట్టించుకున్న నాధుడు లేడు. పశు వైద్య కార్యాలయానికి ఎప్పుడూ తాళమే దర్శనమిస్తోంది. ఉన్న కాంపౌండర్ తాను వేరే ఊరు నుంచి వస్తానని తాను దినసరి వేతనంపై ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నాడు.

ఇక్కడ ఉన్న ఏడి లక్షల జీతం తీసుకుంటూ హైదరాబాదులో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఇక్కడికి రావడం లేదు. ఎక్కడో విధులు నిర్వహిస్తున్న  ఒక కాంపౌండర్ ను  ఈ పశు వైద్య శాలలో   నియమించి డిప్యూటేషన్ పై వారం కు రెండు రోజులు వచ్చి వెళ్తున్నారు. దీంతో తాము పశువులను కాంపౌండర్ కు వైద్యులకు చూపెట్టుకోలేకపోతున్నామని రైతులంటున్నారు.

తాము  తమ పశువుల సమస్యలను ఎవరికి చెప్పుకుందామన్నా ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువుల కోసం కొత్త కొత్తగా వచ్చే పథకాలు రోగాల గురించి అవగాహన కల్పిం చాల్సిన బాధ్యతను పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ పూర్తిగా వీధులను నిర్వహించకుండా రాజధానికి పరిమితమైన ఏడి పై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

దోమకొండ మండల కేంద్రంలోని కటికేవారు మేక మాంసాన్ని చనిపోయిన మేకలను కోసి విక్రయిస్తున్న ఏ ఒక్కనాడు ఆ ప్రాంతాన్ని పశు వైద్యాధికారులు, సిబ్బంది, ఏడి సందర్శించిన సందర్భాలు లేవని స్థానిక వినియోగదారులు ఆరోపిస్తు న్నారు. ప్రజల సొమ్ము లక్షలాదిగా జీతం గా పొందుతున్న ఏడి పై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ను కోరుతున్నారు.

పశు వైద్యశాలకు మరమ్మతులు చేపట్టాలి

తక్షణమే వెటర్నరీ ఆసుపత్రి భవనానికి మరమ్మత్తులు చేపట్టి పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి పశువులకు చికిత్సలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కొత్త సిబ్బందిని నియమించాలని రైతులు,  స్థానికులు కోరుతున్నారు.

అక్కడ విధులు నిర్వహించేవారు డిప్యుటేషన్‌పై వెళ్లారు

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పశువైద్యశాలలో పనిచేసే ఏడి పశువైద్యాధికారులు డిప్యూటేషన్ పై వెళ్లారు. పశు వైద్యశాలకు ఎక్కువగా చికిత్స కోసం పశువులు రాకపోవడం వల్ల అత్యవసరంగా ఉన్న ప్రాంతాలకు డిప్యూటేషన్ పై వెళ్ళారు. దోమకొండలో పశు వైద్యాధికారి ఉండేలా చర్యలు తీసుకుంటాం తీసుకుంటాం. ------

 ------సంజయ్ కుమార్ జిల్లా పశువైద్యాధికారి, కామారెడ్డి