కళానిధి సత్యనారాయణమూర్తి :
ఎవరు చేయదగిన కర్మలను ఫలాపేక్ష లేకుండా చేస్తారో అతనే కర్మత్యాగం చేసిన సన్న్యాసి, చిత్తశుద్ధి కలిగిన యోగి అవుతాడు. కానీ, కేవలం నిత్యాగ్ని హోత్రం లాంటి కర్మలను త్యజించినంత మాత్రాన కాదని ‘భగవద్గీత’ నిర్వచించింది (6.1). కొందరు శిరోముండనం చేయించుకొని కాషాయాంబరాలు ధరించి ఎవరింటికో వెళ్లి భిక్ష స్వీకరిస్తూ ఏ పనీ చెయ్యకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. వారు సమాజానికి బరువు చేటే తప్ప యోగులు కాదు. కోరికలు త్యజించి విహిత కర్మలను చేస్తూ ఫలాన్ని భగవదర్పితం చెయ్యాలి. శబ్దాది విషయాల మీదకు మనస్సు పోకుండా నియంత్రించి తనంతట తానే ఉద్ధరించుకోవాలి. మళ్లీ పతనం కాకుండా జాగ్రత్త పడాలి. శీతోష్ణాలను సుఖదుఃఖాలను సమభావంతో చూడాలి. జ్ఞాన సముపార్జన చేసి అనుభవ పూర్వకమైన జ్ఞానాన్ని కూడా పొంది, అంతటితో ఆగక ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచుకొని మట్టిని బంగారాన్ని ఒకటిగానే చూడాలి. అందరి పట్ల సమభావాన్ని వారు మిత్రులైనా, శత్రువులైనా, బంధువులైనా, కాకపోయినా అలవరచుకోవాలి.
ఏకాంత ప్రదేశంలో ధ్యానం చేస్తూ మనసును ఆత్మమీద నిలపాలి. వస్తువుల మీద ఆశ వదలి వాటిని ఎవరైనా ఇచ్చినా తిరస్కరించాలి. శుచియైన ప్రదేశంలో దర్భాసనం మీద కూర్చుండి తపం చేయాలి. భయక్రోధాలకు లోనుకాక బ్రహ్మచర్యం పాటించాలి. నిద్రాసక్తుడుగా ఉండకూడదు. ఆహార నియమాలను కఠినంగా పాటించాలి. సర్వ భూతాలపట్ల దయ కలిగి వుంటూ, కామాన్ని ప్రభవింపజేసే సంకల్పాలను అభ్యాస పూర్వకంగా నిరోధించాలి. ఇలా ఉంటూ ఏకాగ్రతా చిత్తంతో ఆత్మావలోకానికి ప్రయత్నించాలి. ఒకవేళ యోగికి యోగభ్రష్టత్వం కలిగినా మలిజన్మలో సద్వంశంలో జన్మించి యోగాన్ని కొనసాగిస్తాడు. అంటే, ఆచరించిన యోగం వ్యర్థం కాదు.
ఈ నియమాలు పాటించిన వాడే యోగి లేక సన్న్యాసి. ప్రస్తుతం యోగులమంటూ దాన్ని ఒక వ్యాపారంగా మార్చి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రజలను మోసం చేసే వాళ్ళు ఎక్కువై పోయారు. ఈ కపట యోగుల పట్ల అందరూ అప్రమత్తం గా ఉండాలి.
ఏది ‘యోగం’?
‘భగవద్గీత’లో ప్రతి అధ్యాయం చివర ‘యోగశాస్త్రే’ అని ఉంటుంది. మోక్షసాధన క్రమంలో గీతలోని ప్రతి అధ్యాయంలోను ఒక యోగాన్ని (Spiritual discipline) పరమాత్మ బోధించాడు.- కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం వంటివి. స్థూలంగా ‘యోగం’ అంటే మోక్షసాధన కోసం సాధకుడు పాటించవలసిన శారీరకమైన క్రమశిక్షణ, మానసికమైన ఏకాగ్రత. ఇక్కడ ‘యోగం’ అంటే జీవాత్మ తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి చేసే ‘సాధన’గా మనం అర్థం చేసుకోవాలి.
అయితే, భగవద్గీతలో ‘యోగం’ అనే పదం అనేకార్థాలలో ప్రయోగించడం జరిగింది. వాటిని కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. ‘యోగః కర్మసు కౌశలం’ (2- అంటే, ‘కర్మను సమర్థవంతంగా నిర్వహించడమే యోగం’. మరొక చోట ‘సమత్వం యోగముచ్యతే’ (2- అంటే, ‘సమభావమే యోగం’. మరొక చోట ‘యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ’ (6 అంటే, ‘దేనిని సన్న్యాసం అంటారో అదే యోగం’. ఇలా, భగవద్గీతలో యోగ శబ్దం అనేకార్థాలలో ప్రయోగమైంది. యోగమంటే ‘విధాన’ మనే అర్థం కూడ ఉంది. అయితే, పతంజలి ’యోగ’మనే పదాన్ని ‘సమాధి స్థితిని సాధించే తీవ్ర ప్రయత్నం’గా ప్రయోగించాడు. అందువల్లే ఆయన ‘యోగశ్చిత్తవృత్తి నిరోధః’ (1 ‘మనస్సును తన వ్యాపారాల నుండి మరల్చడమే యోగం’ అని అన్నాడు. ‘మనసు చాలా చంచలమైంది. దానిని నియంత్రించాలంటే తీవ్ర ప్రయత్నం కావాలి. ఆ ప్రయత్నమే యోగం’ అన్నది పతంజలి అభిప్రాయం.
తాం యోగ మితి మన్యంతే
స్థిరా మింద్రియ ధారణామ్
అప్రమత్త స్తదా భవతి
యోగో హి ప్రభవా ప్యయౌ ॥
(క. ఉ. 2.3.11)
దృఢ నిశ్చయంతో బహిరింద్రియ, అంతరింద్రియ నిగ్రహాన్ని సాధించడాన్ని యోగమంటారు. బాహ్య విషయాల నుండి జ్ఞానేంద్రియాలను వేరు చేయడాన్ని ‘వియోగ’మని, వాటిని ఆత్మవద్దకు చేర్చడం ‘యోగ’మని అన్నారు. ఇంద్రియాలు చపలమైనవి, బాహ్యంలో సంచరిస్తూ ఉంటాయి. వీటి ఈ ప్రవృత్తికి పూర్వజన్మ వాసనలు కూడా తోడ్పడుతాయి. ప్రారంభ దశలో అప్రమత్తంగా ఉంటే ‘యోగారూఢమూ’ ఉంది, ప్రమాదం వల్ల ‘యోగభ్రష్టమూ’ ఉంది గనుక, జాగరూకత అత్యావశ్యకం.
(శ్రీ వేదభారతి’ సౌజన్యంతో, ‘వేదాంత పరిభాష’ నుంచి..)
యోగాంగములు
యమ నియమాసన ప్రాణాయామ
ప్రత్యాహార ధారణా ధ్యాన
సమాధయో ష్టా వంగాని -
-- (యో.సూ. 2.29)
యమము (Abstention), నియమము (Observances), ఆసనం (Posture), ప్రాణాయామం (Regulation of breath), ప్రత్యాహారం (Withdrawal of senses), ధారణ (Fixing the mind), ధ్యానం (Meditation), సమాధి (Concentration)- ఈ ఎనిమిది యోగాంగములు. మొదటి మూడు సాధనలు బాహ్యాలు. చివరి మూడు అంతరంగ సాధనలు. వీటి అనుష్ఠానం అస్థిర చిత్తాన్ని స్థిరపరచి అజ్ఞానాన్ని నశింపజేస్తుంది.