calender_icon.png 8 October, 2024 | 3:55 AM

పేదల గూడు కూల్చేందుకే పర్యటన

08-10-2024 02:00:13 AM

కొల్లగొట్టిన సొమ్ము లెక్కలు పెద్దలకు చెప్పేందుకే హస్తినకు సీఎం రేవంత్‌రెడ్డి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): పేదల గూడు కూల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే ఢిల్లీకి వెళ్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. గడిచిన పది నెలల్లో సీఎం 23 సార్లు ఢిల్లీకి వెళ్లారని, పాలనను గాలికి వదిలి గాలి మోటార్ ఎక్కుతూ టైం పాస్ చేయడం దురదృష్టకరమన్నారు.

ఈ చొప్పున మరో నాలుగేళ్లలో 125 సార్లు ఢిల్లీ వెళ్లాల్సి వస్తుందేమోనని ఎద్దేవా చేశారు. సీఎం పర్యటనలతో రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కనీసం విమాన చార్జీలకు సరిపడిన నిధులైనా సీఎం తెచ్చి ఉండరని చురకలంటించారు.

మూసీ ప్రక్షాళన పేరుతో కొల్లగొడుతున్న రూ.వేల కోట్ల లెక్కలను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు అధిష్ఠానంతో చెప్పేందుకే ఆయన హస్తిన పర్యటన అని విమర్శించారు. ఎప్పటికప్పుడు ఢిల్లీ బాసులకు జై.. కొడితే తన సీటుకు ఢోకా ఉండదని సీఎం భావిస్తున్నారని, అదే తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమైందన్నారు.

పది నెలల పాలనలో సీఎం తెలంగాణలో ఏ వర్గ ప్రజల జీవితాలను బాగు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘ఢిల్లీ గులాంగిరి’ పర్వం కొనసాగుతూనే ఉంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టడమే సీఎం పనిగా మారిందని మండిపడ్డారు.

ప్రధాని మోదీని ‘బడే భాయ్’ సీఎం రేవంత్‌రెడ్డి ఆ భాయ్‌ని ఒప్పించి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌తో పాటు వరద సాయం కేటాయింపు లోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని సీఎం గుర్తుపెట్టుకోవాలని, వారికి మేలు చేసే పనులపై సీఎం శద్ధ వహించాలని హితవు పలికారు.

లక్షన్నర కోట్లు ఎవరి కోసం?

మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నచందంగా సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి తయారైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ తెల్లారితే రాష్ట్రం అప్పులపాలైందని, డబ్బులు లేవంటూ చెప్పే రేవంత్.. మూసీ పేరిట లక్షాయాబై వేల కోట్లను ఎవరి సోకులు, ఆర్భాటం కోసం వెచ్చిస్తున్నారని ప్రశ్నించారు.

అధికారం చేపట్టి పది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రైతు రుణమాఫీ, రైతు బంధు, కౌలు రైతులకు డబ్బులు లేవన్నారు. నిరుద్యోగ భృతి, పేదలకు పెన్షన్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు, ఆడపిల్లలకు స్కూటీలు, ఉద్యోగులకు డీఏలకు ఇవ్వలేదన్నారు.

మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, తులం బంగారం తదితర పథకాలకు పతరేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీకి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.