- ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న పాపాల చిట్టా
- తాజాగా స్థిరాస్తి వ్యాపారులను బెదిరించిన ఘటనపై కేసు
మంథని,సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): మంథనిని హడలెత్తించిన వసూల్ రాజా పాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారు లను బెదిరించి రూ.10 లక్షలు దండుకున్న ఘటన తెరమీదకు వచ్చింది. ఇంతకాలం మంథనిలో అందరికి కంట్లో నలుసుగా మారిన మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సత్యనారాయణ నేరాల చిట్టాను పోలీసులు బయటకు లాగుతుండటంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. రామగిరి మండలంలో రియల్ ఎస్టే ట్ వ్యాపారులను బెదిరించి రూ.10 లక్షలు బలవంతంగా దండుకున్న సత్యనారాయణ, అతని అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రామగిరి మండలం కల్వచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సైండ్ల తిరుపతి మరికొందరు కలిసి కల్వచర్ల శివారులో వెంచర్ ఏర్పాటుచేసి, రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నిస్తుంటే గత జూన్, జూలైలో సత్యనారాయణ గన్‌మెన్‌తో వచ్చి బెదిరించాడు. గత ఆగస్టు 20న మంథని సబ్ రిజిస్టార్ వద్దకు వెళ్లగా అక్కడకూ వెళ్లి రూ.20 లక్షలు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే చంపుతానని బెదిరించినట్టు చెప్పారు. మంథనికి చెందిన రావికంటి సతీశ్.. తాను సత్యనారాయణతో డీల్ చేస్తానని రూ.10 లక్షలు ఇచ్చే విధంగా వారిని ఒత్తిడి చేయగా భయంతో ఒప్పుకొన్నట్టు చెప్పారు.
రావికంటి సతీశ్ అకౌంట్లో రూ.10 లక్షలు జమ చేశామని, ఇంకా డబ్బులు కావాలని బెదిరిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇనుముల సత్యనారాయణ, రావికంటి సతీశ్‌పై కేసు నమోదు చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో మంథనిలో వాడివేడి చర్చ జరుగుతుంది. ఈ వసూల్ రాజా దందాలు ఇంకెన్ని బయటకు వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.