calender_icon.png 17 October, 2024 | 3:43 PM

నైజీరియాలో ఘోరం ప్రమాదం

17-10-2024 01:27:28 AM

  1. ఆయిల్ ట్యాంకర్ పేలి 147 మంది మృతి
  2. నిప్పంటుకొని పేలిపోయి భారీగా మంటలు
  3. రోడ్డుపైనే కాలి బూడిదైన 97 శవాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో ఆయిల్ పట్టుకొనేందుకు జనం ఎగబడిన సమయంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో 147 మంది మరణించారు. జిగావా రాష్ట్రంలోని జాతీయ రహదారిపై మజియా పట్టణం వద్ద స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే మరణించిన వారిలో 97 మృతదేహాలు ఘటనా స్థలంలో రోడ్డుపైనే కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై జిగావా రాష్ట్ర అత్యవసర విభాగం అధిపతి హరున మీరిగా.. 147 మృతదేహాలను గుర్తించామని, మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపారు.

ప్రమాదం అర్ధరాత్రి జరగటం, చాలా శవాలు పూర్తిగా కాలిపోవటంతో మృతులసంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదు. రోడ్డుపై ట్యాంకర్ బోల్తా పడగానే ఆయిల్ పట్టుకొనేందుకు స్థానికులు భారీగా గుమికూడారని, ఆ సమయంలో ట్యాంకర్ పేలిపోయిందని పోలీసులు వెల్లడించారు.