ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం ఉవెత్తున ఉద్యమం కొనసాగుతోంది. అదే సమయంలో భార్య అనారోగ్యంతో చనిపోయింది. అయిన కొన్ని రోజులకే మళ్లీ ఉద్యమంలో పాల్గొన్నాడు. రాష్ర్ట సాధనే లక్ష్యంగా ఆదిలాబాద్‌లో సుదీర్ఘ కాలంపాటు దీక్ష శిబిరాన్ని నిరహించడంలో కీలక ఉద్యమకారుడుగా వ్యవహరించాడు. జైలుకు వెళ్లిన తెలంగాణ కోసం వెనకడుగు వేయలేదు. యాభై ఏళ్ల వయస్సులోనూ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించాడు ఉద్యమకారుడు తుడుం రాములు.
భార్య చనిపోయినా
ఈయనది ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాన్ప మెడిగుడా గ్రామం. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం ఆదిలాబాద్‌లో జేఏసీ ఆధర్యంలో కొనసాగిన దీక్ష శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం జేఏసీ ఆధర్యంలో సుదీర్ఘంగా 1,523 రోజులపాటు దీక్ష శిబిరం కొనసాగింది. దీక్ష శిబిరాన్ని కొనసాగించినవారిలో తుడుం రాములు సైతం కీలకంగా వ్యవహరించాడు. ప్రతిరోజు గ్రామం నుంచి బయలుదేరి సాయంత్రం వరకు దీక్ష శిబిరంలో పాల్గొన్నాడు.
ఇలా కొన్ని నెలలపాటు దీక్ష శిబిరంలో కొనసాగాడు. ఇదేక్రమంలో భార్య చంద్రబాయి అనారోగ్యంతో మంచం పట్టింది. అయితే ఒకవైపు ఆమె బాగోగులు చూసుకుంటూనే.. మరోవైపు దీక్ష శిబిరంలో పాల్గొన్నాడు. అయితే భార్యను వైద్యం కోసం మహారాష్ర్టకు తీసుకెళ్లాడు. కానీ అనారోగ్యంతో 2012 మార్చి 9న మృతిచెందింది. భార్య చనిపోయిన దుఃఖంలో ఉన్నప్పటికీ, తుడుం రాములు మళీ ఉద్యమ శిబిరానికి వచ్చి ఉద్యమంలో పాల్గొన్నాడు
పలుమార్లు జైలుకు..
తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన అనేక పోరాటాల్లో పాల్గొన్న తుడుం రాములు వివిధ కేసుల్లో జైలుకు సైతం వెళ్లాడు. ఉద్యమ సమయంలో జిల్లాలో పర్యటించిన అప్పటి ఇన్‌చార్జి మంత్రి బసవరాజు సారయ్య కానాయ్‌పై ఉద్యమకారులతో కలిసి కోడిగుడ్లతో దాడిచేశాడు. ఈ కేసులో అరెస్టు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ బస్సుల బంద్‌కు పిలుపునిచ్చిన క్రమంలో అడ్డుకొని అద్దాలను ధంసం చేసిన కేసులో సైతం ఆయన మరోమారు జైలుకు వెళ్లాడు.
యువకులతో పోటీగా
యువకులతో సమానంగా తుడుం రాములు అన్ని నిరసనల్లో పాల్గొంటూ తెలంగాణ ఉద్యమకారుడిగా ముందు వరుసలో నిలిచారు. వయస్సు పైబడినప్పటికీ ఉత్సాహంగా యువతతో కలిసి ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు. అలా ఉద్యమం జరిగినన్ని రోజులు శిబిరంలో తుడుం రాములు ఉద్యమకారుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు పొందాడు.
- వెంకటేశ్, ఆదిలాబాద్, విజయక్రాంతి