calender_icon.png 31 January, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాల అడవుల్లో పెద్దపులి..!

31-01-2025 05:01:50 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతంలో శుక్రవారం అటవీ సిబ్బందికి పులి కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు, బుగ్గ దేవాలయానికి వెళ్లే భక్తులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. గురువారం సాయంత్రం నుండే కన్నాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలిసింది. పెద్దపులి కదలికలను గుర్తించేందుకు తిరుగుతున్న అటవీ సిబ్బందికి బుగ్గ దేవాలయానికి అతి సమీపంలోనే పులి కనిపించింది. కన్నాల అటవీ ప్రాంతంలో గల నీటి కుంటలో పెద్దపులి నీళ్లను తాగుతుండగా అటవీ సిబ్బంది ప్రత్యక్షంగా చూసి నివ్వెరపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

కుంటలో నీళ్లు తాగిన పెద్దపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న బెల్లంపల్లి రేంజి అటవీ అధికారి పూర్ణచందర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని బుగ్గ దేవాలయానికి వెళ్లే మట్టి రోడ్డుపై, నీళ్లకుంట ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. అదేరోజు మధ్యాహ్నం పెద్దపులి కన్నాల అటవీ ప్రాంతం మీదుగా పెద్దనపల్లి మామిడి తోటల వైపు వెళ్లినట్లు స్థానికుల సమాచారం అందడంతో అటవీ అధికారులు పెద్దపులి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతంలో పెద్దపులి కనిపించడంతో అటవీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కన్నాల-బుగ్గ రోడ్డు గుండా ప్రయాణాలు సాగించవద్దని, ప్రజలకు సూచిస్తున్నారు. అటవీ ప్రాంతంలోని పొలాల్లోకి వెళ్లే రైతులు అప్రమత్తంగా, జాగ్రత్తలు పాటించాలని గ్రామాల్లో డప్పు చాటింపు వేయించారు.