calender_icon.png 7 February, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త వరిపేట శివారులో అడవి పందిపై పెద్దపులి దాడి..?

06-02-2025 10:49:31 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): గత వారం రోజులుగా బెల్లంపల్లి మండలం కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతంలో పెద్దపులి హడలెత్తిస్తుంది. సమీప గ్రామాల ప్రజలకు, అటవీ అధికారులకు తన కదలికల ద్వారా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గురువారం సాయంత్రం బుగ్గ దేవాలయం సమీపంలోని కాసిపేట మండలంలో గల కొత్త వరిపేట శివారులో అడవి పందిపై క్రూరంగా దాడి చేసి చంపింది. పెద్దపులి కొత్త వరిపేట శివారు పత్తి చేలలో అడవిపందిని చంపడంతో కొత్త వరిపేట, పాత వరి పేట, బుగ్గ గూడెం, కరిశల ఘట్టం గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

అటవీ సిబ్బంది మాత్రం అడవి పందిపై పెద్దపులి దాడి చేసి చంపిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. కన్నాల-బుగ్గ, బుగ్గ గూడెం ప్రాజెక్ట్, వరిపేట ప్రాంతాల్లో పెద్దపులికి సంవత్సరాంతం నీటి వసతి, ఆహారం లభించే సానుకూల పరిస్థితులు ఉండడంతో బుగ్గ అడవుల్లో స్థావరం ఏర్పరచుకునే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి. అటవీ అధికారులు, సిబ్బంది పెద్దపులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభావిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.