రోజుకు 14 గంటల పని రూల్‌ను వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు
చట్టాల ప్రకారం కూడా కష్టమే
బెంగళూరు, జూలై 21: నిన్న, మొన్నటి వరకు కర్ణాటక సర్కారు తీరుతో బెంబేలెత్తిన ఐటీ వర్గాలు మరోమారు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. స్థానిక రిజర్వేషన్ రగడ చల్లారిందని అనుకునే లోపే సర్కారు మరో ‘టైమ్’ బాంబ్ పేల్చడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. టెకీలు రోజుకు 14 గంటలు పని చేయాలని కొన్ని కంపెనీలు కార్మిక శాఖను కోరగా.. అందుకు కార్మికశాఖ కూడా సరే అందనే వార్తలు రావడంతో టెకీలు ఉలిక్కిపడ్డారు.
ఈ 14 గంటల పని నియయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మన దేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో దాదాపు 40 శాతం బెంగళూరు టెక్ కంపెనీలే ఉత్పత్తి చేస్తాయి. రిజర్వేషన్ల రగడ చల్లారింది ఇక ప్రశాంతంగా ఉండొచ్చని అనుకుంటున్న పరిశ్రమ వర్గాలను ఈ నిర్ణయం ఒక్క సారిగా కుదుపుకు లోను చేసింది. కొద్ది రోజుల కిందటే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పని గంటల మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఉద్యోగి వారంలో 70 గంటల పాటు పని చేస్తేనే దేశ ఆర్థిక ప్రగతి వేగం పుంజుకుంటదని నారాయణ మూర్తి చెప్పగా.. కర్ణాటక ప్రభుత్వం కూడా పని గంటల పెంపుకోసం చూడడం గమనార్హం.
భగ్గుమన్న ఉద్యోగులు
దేశం ఆర్థికంగా ప్రగతి సాధించేందుకు వా రంలో 70 గంటల పాటు పని చేయాలన్న నారాయణమూర్తి వ్యాఖ్యలపై ఉద్యోగులు మండి పడ్డారు. ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన తెలిపారు. నారాయణమూర్తి చెప్పిన వారాని కి 70 పనిగంటల ప్రకారం.. చూసుకున్నా రోజుకు 11.66 గంటలు (వారానికి ఆరు రోజులు) కానీ ప్రస్తుతం సర్కారు చూస్తున్న రోజుకు 14 గంటల పని నారాయణమూర్తి చెప్పినదానికంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ సవరణ ప్రకారం ప్రస్తుతం రోజుకు ఉన్న మూడు షిఫ్ట్‌ల విధానం స్థానంలో రెండు షిఫ్ట్‌ల విధానం వచ్చే చాన్సుంది. ఒక వేళ వర్కింగ్ షిఫ్ట్‌లను కానీ తగ్గిస్తే.. మూడో వంతు ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసే ప్రమాదం ఉందని కర్ణాటక రాష్ట్ర ఐటీ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) హెచ్చరించింది.
సవరణకు చూస్తున్న సర్కారు..
కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1961ని సవరించేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తాము ప్రతిపాదించిన రోజులో 14 గంట ల పనిని కూడా ఈ సవరణలో ఆమోదించాలని ఐటీ కంపెనీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 14 గంటలు (12 గంట లు+2 గంటల ఓటీ) ఉండాలని పలు కంపెనీలు కోరుతున్నాయి. ఐటీ/బీపీవో తదితర రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ నిబంధన వర్తించనున్నట్లు వినికిడి. ఈ బిల్లు గురించి ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ త్వరలోనే క్యాబినేట్ భేటీ నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారట.
కార్మిక చట్టాలేం చెబుతున్నాయి
టెకీల పనిగంటలను 14 గంటలకు పొడగించాలని కంపెనీలు కోరుతున్న వేళ.. అసలు కార్మిక చ ట్టాలు ఏం చెబుతున్నాయని ఆరా తీస్తున్నారు. ఉద్యోగి రోజుకు 9 గంటల పాటు పని చేయాలి. ఎవరైనా ఎక్కువ పని చేస్తే దానిని ఓవర్‌టైమ్ (ఓ టీ) కింద లెక్కేయాలి. కానీ ప్రస్తుతం ఐటీ/ఐటీఈఎస్/బీపీవోల్లో పని వేళలను పెంచేందుకు కార్మిక శాఖ మొగ్గు చూపుతోంది. పెరిగిన పని గంటలను ఓటీగా పరిగణించకూడదనే నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తం అవుతోంది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ విధానంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. ఐటీ ఉద్యోగుల్లో 45 శాతం మంది మానసిక సమస్యలు, ఒత్తిడితో బాధపడుతుండగా.. 55 శాతం మంది శారీరక సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తు తం ఉన్న పనివేళలతోనే ఇటువంటి సమస్యలు ఎదురైతే పనివేళలు పెరిగితే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నా రు. పని గంటల పెంపుపై అనేక ఉద్యోగ సంఘా లు మండిపడుతున్నాయి. మరి మొన్న రిజర్వేషన్ల అంశాన్ని వాయిదా వేసినట్లే ఈ నిర్ణయం కూడా వాయిదా పడుతుందో లేక అమలవుతుందో వేచి చూడాలి.
సీఎంతో చర్చిస్తా..
పని వేళల పెంపు గురించి అలాగే ఐటీ, ఐటీఈఎస్ సెక్టార్లను కార్మిక శాఖ నుంచి మినహాయించే అంశాల గురించి త్వరలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చిస్తానని కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ వెల్లడించారు. ఐటీ రంగ నిపుణులతో దీనిపై చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.