మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణతో రేవంత్ సర్కార్ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బడే భాయ్ మోదీ నోట్ల రద్దుతో ఏ విధమైన తప్పు చేశారో తెలంగాణలో చోటా భాయ్ హైడ్రా విషయంలో అదే తప్పు చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి తాబేదార్ల కోసం హైడ్రా, మూసీ వచ్చిందని, లక్షా 50 వేల కోట్లు అని ఎవరు చెప్పారని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే వెయ్యి కోట్ల విలువైన పేదల ఇండ్లు కూల్చి కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారని, మూసీ ప్రాజెక్టు డబ్బుల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
డబ్బులు సంపాదించడంలో సీఎం, డిప్యూటీ సీఎం పోటీ పడుతున్నారని ఆరోపించారు. మూసీపై ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉందా అని ఆయన ప్రశ్నించారు. మూసీ నీళ్లను మురికి నీళ్లుగా మార్చిన ఘనత గత కాంగ్రెస్ పాలకులేదనని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనను రూ.16 వేల కోట్లతో బీఆర్‌ఎస్ పనులు ప్రారంభించిందన్నారు.
కొండపోచమ్మ సాగర్ నుంచి హిమాత్ సాగర్ కు నీళ్లు తీసుకువచ్చే కార్యక్రమానికి కూడా కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. కాంగ్రెస్ పాలకులకు చేతకాకపోతే చేయడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. కమీషన్లు రావనే రైతుబంధు, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. మూసీకి లక్షా 50 వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు.
ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారికి లుక్ ఔట్ నోటీసులు ఇస్తున్నారని, వారిని చూసి రేవంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. హర్యానా ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా బీజేపీ మూడోసారి విజయం సాధించిందని ఆయన అన్నారు.